కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించారు : కావలిలో అమానుషం

  • Published By: bheemraj ,Published On : August 11, 2020 / 06:49 PM IST
కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించారు : కావలిలో అమానుషం

నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్రం పట్టించుకోకుండా దారుణంగా ప్రవర్తించారు. కరోనా బాధితులు, మృతదేహాల పట్ల అమానుషంగా ప్రవర్తించొద్దని ప్రభుత్వం చెప్పినా… పెడచెవిన పెట్టారు. దీంతో మున్సిపల్, హాస్పిటల్ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో రోజు రోజుకు విజృంభిస్తోంది. జిల్లాలో 14,614 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 175 మంది చనిపోయారు. కావలి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వ్యక్తులు కరోనాతో మరణించారు. వారిని ఖననం చేసేందుకు వారి మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది మున్సిపాలిటి చెత్త ట్రాక్టర్ లో తరలించారు.

సాధారణంగా ఈ ట్రాక్టర్ లో చెత్త తీసుకెళ్లడానికి, ఏదైనా జంతువుల కళేబరాలను తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. అలాంటిది కరోనాతో చనిపోయిన ఇద్దరు మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడమనేది దారుణమైన ఘటన. కనీసం నిబంధనలు పాటించకుండా.. గౌరవం, మర్యాద కూడా ఇవ్వకుండా చెత్త ట్రాక్టర్ లో తరలించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. చనిపోయిన వ్యక్తులు బతికి ఉన్నప్పుడు ఎలా బతికారో, వారి స్థాయి ఏమిటో కూడా తెలియదు.

అయితే కరోనాతో మృతి చెందడం బాధాకరమైన విషయమే కానీ ఇలా అంత్యక్రియలకు ఇంత ఘోరంగా అవమాన పరిచే రీతితో చెత్త ట్రాక్టర్ లో తరలించడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఇక వారి కుటుంబ సభ్యులు ఎలా తల్లడిల్లిపోతుంటారో చెప్పలేని పరిస్థితి. అయినా కరోనా మృతదేహాలను అంబులెన్స్ లో తరలించాలని నిబంధన ఉంది. కానీ నిబంధనను నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా పాటించడం లేదు. గతంలో కూడా కరోనాతో చనిపోయిన మృతదేహాలను పెన్నానదిలో జేసీబీతో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

కరోనాతో చనిపోయిన వ్యక్తులకు గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరపాలని సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయినా కూడా వారికి గౌరవ ప్రదంగా అంత్యక్రియలు జరిగే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే జిల్లాలో కరోనా బారిన పడి 175 మంది చనిపోయారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఒక వైపు చెబుతున్నా కిందిస్థాయిలో నిబంధనలు ఎక్కడ కూడా ఆచరణకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ఒక ఏరియాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే అంబులెన్స్ రావడం కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఆ అంబులెన్స్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కరోనా మృతదేహాలను తీసుకెళ్లేందుకు చాలా కష్టంగా ఉంది. ఫోన్ చేసినా కూడా స్పందించని పరిస్థి ఉంది. దీంతో కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు రోజుల తరబడి హాస్పిటల్ లో ఉండాల్సివస్తోంది.

శవాల గదిలో, పోస్టుమార్టం గదిలో ఉంచి తర్వాత ఒకేసారి పది నుంచి పదిహేను మృతదేహాలను తరలిస్తున్నారు. అధికారులు చెబుతున్నా కింది స్థాయి సిబ్బంది ఎలాంటి నియమ నిబంధనలు పాటించడం లేదు.