పోర్టులు చకచకా : నా టాప్ ప్రాధాన్యతలు ఇవే – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 01:18 AM IST
పోర్టులు చకచకా : నా టాప్ ప్రాధాన్యతలు ఇవే – సీఎం జగన్

రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సీఎం జగన్‌ సమీక్షించారు. 2019, డిసెంబర్ 18వ తేదీ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. దుగ్గజరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ప్రణాళికలు తయారు చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. మొదటి దఫాలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలన్నారు.

మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా కట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మచిలీపట్నం పోర్టుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని, వీలైనంత వేగంగా నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మిగిలిన పోర్టులకు అవసరమైన భూమిని వెంటనే సేకరించుకోవాలని సూచించారు. వచ్చే జూన్‌ నాటికి మచిలీపట్నం పోర్టుకు, రామాయపట్నం పోర్టుకు ఫైనాన్షియల్‌ క్లోజర్‌ ప్రక్రియలను పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే మే-జూన్‌ నాటికి ఈ రెండు పోర్టులకూ శంకుస్థాపన చేయాలన్నారు.

విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తానని కేంద్రం చెప్పిందని, ఆ మేరకు నిధులను కేంద్రం నుంచి తెచ్చుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. నవరత్నాలు, నాడు-నేడు కార్యక్రమాలు తనకు అత్యంత ప్రాధాన్యతాంశాలని సీఎం అన్నారు. ఏటా 6లక్షల ఇళ్లు నిర్మించాలన్నది రెండో ప్రాధాన్యతాంశమని వెల్లడించారు. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ చేపట్టడం మూడో ప్రాధాన్యత అంశం అని సీఎం తెలిపారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సహా, పోలవరం నుంచి గొల్లపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్లకు గోదావరి జలాలను తరలించడం, మరికొన్ని ప్రాధాన్యత ఉన్న అంశాలుగా పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు తాగునీటిని అందించాలన్న వాటర్‌ గ్రిడ్‌ చేపట్టడం.. ఇవి తన ఇతర వరుస ప్రాధాన్యత అంశాలుగా జగన్ తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసారంగంలో స్థిరత్వం ఉంటుందని, అలాగే కరవు ప్రాంతాలకు ఊరట లభిస్తుందని అధికారులకు వివరించారు. 

నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని సీఎం చెప్పారు. విద్యుత్‌ సంస్కరణల అంశంపై కూడా ఈ సమావేశంలో సీఎం జగన్‌ చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్‌ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నామని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 12వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు ఇస్తే సరిపోతుందని తెలిపారు. సుమారు రూ. 35-37వేల కోట్ల ఖర్చుతో 12వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. అంటే మూడు, నాలుగు సంవత్సరాల్లో ట్రాన్స్‌కోకు ఇస్తున్న సబ్సిడీ డబ్బుతో 12వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని, ఈ దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
Read More : టార్గెట్ జగన్ : కుంటుపడిన రాష్ట్రాభివృద్ధి – బాబు