అంతుచిక్కని వింత వ్యాధి.. 505కు చేరిన బాధితులు​​​​​​​

  • Published By: vamsi ,Published On : December 8, 2020 / 10:56 AM IST
అంతుచిక్కని వింత వ్యాధి.. 505కు చేరిన బాధితులు​​​​​​​

అంతుచిక్కని వింత వ్యాధి అసలు ఎందుకు వస్తోందో అర్థం కావట్లేదు.. ఏమైందో కారణం తెలియదు.. కానీ, వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి. సామాన్య జనం భయంతో వణికిపోతున్నారు.



బాధితుల ఆరోగ్య లక్షణాలను అనుసరించి కొందరిని సమీపంలోని వైద్యకళాశాలకు తరలిస్తున్నారు. ఆస్పత్రిలో చేరినవారు ఓ పక్క కోలుకుంటుంటే.. మరోపక్క కొత్త బాధితులు ఆస్పత్రికి వస్తున్నారు. అస్వస్థతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇప్పుడు 505కు చేరుకోగా.. మూడు రోజుల్లో 332 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. మరో 153 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.



మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడకు 19 మందిని తరలించగా.. చికిత్స పొందుతున్న వారిలో 71 మంది చిన్నారులు, 27 మంది మహిళలు ఉన్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్‌ అనే లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు ఎయిమ్స్‌ నిర్వహించిన పరీక్షలో వెల్లడి కాగా.. తాగునీరు, పాల ద్వారా ఈ అవశేషాలు రోగుల శరీరంలోకి చేరి ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.



నోటి వెంట నురగలు కక్కుతూ.. మూర్చపోతూ పడిపోతూ ఉండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఏలూరు నగరం దక్షిణవీధి నుంచి ప్రారంభమైన ఈ మహమ్మారి నగరమంతా విస్తరించింది. సమీపంలోని దెందులూరులో కూడా ఇవే లక్షణాలతో ఆరుగురు కిందపడిపోయారు. వారిని కూడా ఏలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.