గిదేమి రోగం : ఏలూరులో పెరుగుతున్న బాధితులు

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 06:27 AM IST
గిదేమి రోగం : ఏలూరులో పెరుగుతున్న బాధితులు

అంతుచిక్కని అనారోగ్యం ఏలూరును వేధిస్తోంది. వింత వ్యాధితో అప్పటికప్పుడే కుప్పకూలిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 556కి చేరింది. ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి 459 మందిని డిశ్చార్జ్‌ అయ్యారు. మెరుగైన చికిత్స కోసం 30 మంది రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం ఒక్కరోజే 47 కేసులు నమోదు కాగా.. నాలుగు రోజుల్లో మొత్తం 556 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఏలూరు మొత్తం భయం గుప్పిట్లో బిగుసుకుపోయింది. ఇళ్లల్లోనుంచి రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏలూరులో ఏ వీధి చూసినా.. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. దక్షిణపు వీధి, తూర్పు వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే.. కుటుంబాలకు కుటుంబాలే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి.



పురుగుల మందు అవశేషాలు : –
ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వింత వ్యాధి అంతకంతకు విస్తరిస్తోంది. ఈ-కొలి లాంటి బ్యాక్టీరియా పరిశీలనకు 22 నీటి నమూనాలను సేకరించగా.. వాటిలో పురుగుమందుల అవశేషాలున్నట్లు గుర్తించారు వైద్యులు. మొత్తం 62 నమూనాలు సేకరించగా వాటిలో 10 నమూనాల్లో పరిమితికి మించి లెడ్‌, నికెల్ ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 40 నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపామని.. వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్‌ పరీక్షల్లో వైరస్‌, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని వైద్యశాఖ చెబుతోంది. కూరగాయల నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌కు.. కణజాల పరీక్ష కోసం 10 నమూనాలను సీసీఎంబీకి పంపామని వివరించింది. దీంతో పాటు రసాయన విశ్లేషణ కోసం ఐఐసీటీకి నమూనాలను పంపినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.



ఇతర జిల్లాల్లో : –
ముందుగా ఏలూరులోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ వ్యాధి ఇతర ఏరియాలతో పాటు జిల్లాలకూ వ్యాపించింది. పశ్చిమగోదావరి జిల్లాలోని నారాయణపురం, కొవ్వలి, దెందులూరుతో పాటు కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరులో ఫిట్స్‌ కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.



నిఫా వైరస్ : –
మరోవైపు ఏలూరులో అనారోగ్య పరిస్థితులపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాటర్ పొల్యూషన్ కారణమని కొందరు వైద్యులు చెబుతుంటే… నిఫా వైరస్ కూడా కావచ్చని డాక్టర్ సమరం అంటున్నారు. ఏలూరులో నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. గతంలో కేరళలో నిఫా వైరస్ విజృంభించిందన్న ఆయన.. పరిశోధనలు జరిపి నిర్థారణ చేయాలన్నారు.