వింత వ్యాధుల మిస్టరీ..ఏం జరుగుతోంది ? ఎందుకిలా అవుతోంది

వింత వ్యాధుల మిస్టరీ..ఏం జరుగుతోంది ? ఎందుకిలా అవుతోంది

Mystery of strange disease : పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధుల మిస్టరీ కొనసాగుతోంది. అంతుచిక్కని రోగాలు.. పలు గ్రామాలను వెంటాడుతున్నాయి. ఏలూరు ఘటన మరవక ముందే.. అదే తరహాలో పూళ్ల, కొమరేపల్లి గ్రామాల్లో ప్రజలు ఒకరి తర్వాత ఆసుపత్రికి చేరుతున్నారు. మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. మరి అక్కడ ఏం జరుగుతోంది..? ఎందుకిలా అవుతోంది.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి ఘటన మరిచిపోకముందే.. మళ్లీ పలు ఊళ్లలో వింతవ్యాధి కేసులు నమోదవుతున్నాయి.. ఏలూరు తర్వాత పూళ్ల, కొమెరేపల్లిలో వరుసగా ప్రజలు అస్వస్థతకు గురవుతుండంతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు.. కొమెరేపల్లిలో కొత్తగా 12 కేసులు నమోదయాయ్యాయి.

మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు :-
గురువారం రాత్రి నుంచి ఉన్నట్టుండి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోయారు.. శుక్రవారం ఉదయానికి ఈ తీవ్రత ఎక్కువైంది. దీంతో బాధితులందరిని హుటాహుటిన ఏలూరు, దెందులూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.. వింతవ్యాధి సమాచారం అందుకున్న వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.. ఇంటింటికి సర్వే చేపట్టారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రబలుతున్న వింత వ్యాధిపై సీఎం జగన్‌ సమీక్షించారు. సీఎస్‌తోపాటు.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.వెంటనే ఏలూరుకు వెళ్లి వింత వ్యాధిపై చర్యలు చేపట్టాలని జగన్‌ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఆదేశించారు.

కొమరేపల్లిలో సీఎస్ పర్యటన :-
సీఎం ఆదేశాలతో కొమరేపల్లిలో సీఎస్‌ ఆదిత్యానాథ్‌ దాస్‌ పర్యటించారు.. విచారణ జరిపి త్వరలోనే నివేదికను సిద్ధం చేస్తామన్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే… ఓ చిన్నారికి వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఫిట్స్‌తో నోటి నుంచి నురగలు కక్కింది. వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వింత వ్యాధి తీవ్రంగా ఉండటంతో చిన్నారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సీఎస్ ఆదేశించారు.

మంత్రి ఆళ్ల నాని అనుమానాలు :-
ఇక పశ్చిమగోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని .. మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్‌ చేశారు. గతంలో ఏలూరులో అంతుచిక్కని వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి .. నాలుగురోజులు హడావుడి చేసి, వదిలేశారన్నారు. పాలకులు ప్రజారోగ్యం మీద పెట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం కొమెరేపల్లి గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని. స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, అధికారులతో కలిసి కొమెరేపల్లిలోని పలు కాలనీల్లో పర్యటించారు.. వ్యాధి ప్రబలడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి ఆళ్ల నాని.
ఈ వ్యాధి మరికొన్ని గ్రామాలకు విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.. ఇప్పటికే ఏలూరు ఘటన పీడకలలా మారిందని.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని కోరుతున్నారు.