Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జున సాగర్.. 14 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండిపోతుంది. కృష్ణానదికి వరద పోటెత్తగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలయ్యాయి.

10TV Telugu News

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్‌ జలాశయం నిండిపోతుంది. కృష్ణానదికి వరద పోటెత్తగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలయ్యాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను దిగువకు విడుదల చేసేందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లును ఎత్తివేశారు అధికారులు. గంట గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటినిల్వలు పెరుగుతుండగా.. మొత్తం 14గేట్లు ఎత్తేశారు అధికారులు. శ్రీశైలం జలాశయం 5లక్షల క్యూసెక్కుల వరద నీరు పైనుంచి వస్తోంది. సాగర్ ఎగువ ప్రాంతాలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేయగా.. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో వరద ఉధృతి పెరగుతుంది.

ఈ క్రమంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ఎన్నో ఏళ్లుగా ఆగస్ట్ నాటికి ఈ విధంగా కృష్ణమ్మ ఉప్పొంగిన పరిస్థితులు లేవు. ముందుగానే నీరు వస్తుండడంతో కుడికాలువ ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరిసాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. కాలువకు నీరు విడుదల కాగానే వరి నారుమళ్లు పోసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు రైతులు. ఆయకట్టులో వరిసాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తుండగా.. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం 14 గేట్లు ఎత్తి దిగువ పులిచింతల వైపునకు నీటిని వదిలారు. మరికాసేపట్లో మరో పది గేట్లను ఐదడుగుల మేర ఎత్తే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు.

నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 585 అడుగులకు నీరు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 282.1472 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం సాగర్‌ ఇన్‌ఫ్లో 5.14లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి వస్తుంది. ఇవాళ సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు లక్ష క్యూసెక్కులు, రేపటి వరకు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది.

10TV Telugu News