నేటి నుంచే నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం

  • Published By: bheemraj ,Published On : November 21, 2020 / 07:08 AM IST
నేటి నుంచే నాగార్జునసాగర్‌ – శ్రీశైలం లాంచీ ప్రయాణం

Nagarjunasagar – Srisailam launch : నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి ఇవాళ నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ నుంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన శ్రీశైలానికి తొలి లాంచీ వెళ్లనుంది. ఈ నెల 14వ తేదీ నుంచే లాంచీ ప్రయాణం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పర్యాటకులు ఎవరూ టికెట్లు బుక్‌ చేసుకోకపోవడంతో ఆ ప్రయాణాన్ని రద్దు చేశారు.



శనివారం లాంచీ ప్రయాణికి సాగర్‌ నుంచి శ్రీశైలం ప్రయాణించడానికి 16మంది పర్యాటకులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. దీంతో ఇవాళ లాంచీ ప్రయాణం ప్రారంభిస్తున్నారు. ఉదయం 9.30కు నాగార్జునసాగర్‌లో లాంచీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30కి శ్రీశైలం చేరుకుంటుంది.



హైదరాబాద్‌ నుంచి పర్యాటక శాఖ బస్సుల్లో శ్రీశైలం వరకు 13మంది పర్యాటకులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఇక రేపు ఉదయం 9.30కు శ్రీశైలం నుంచి లాంచీ సాగర్‌కు బయలుదేరుతుంది. సాగర్‌కు చేరుకున్న పర్యాటకులను ఆదివారం సాయంత్రం పర్యాటశాఖ బస్సులు తిరిగి హైదరాబాద్‌కు చేరుస్తాయి.



https://10tv.in/goodbye-sun-this-town-in-alaska/
సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు లేదా శ్రీశైలం నుంచి సాగర్‌కు ఏదో ఒక వైపునకు ప్రయాణించే పెద్దలకు వెయ్యిరూపాలుగా టిక్కెట్‌ ధరను నిర్ణయించారు. పిల్లలకు అయితే 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్‌ నుంచి వచ్చే పర్యాటకుల్లో పెద్దలకు 3500, పిల్లలకు 2500లుగా టికెట్‌ ధరలు నిర్ణయించారు.



హైదరాబాద్‌ నుంచి వచ్చే పర్యాటకులను పర్యాటక శాఖ బస్సులో శ్రీశైలం వరకు తీసుకెళ్లి భోజన వసతి, రూం సౌకర్యం కల్పిస్తారు. మరుసటి రోజు సాగర్‌కు లాంచీలో తీసుకువచ్చి పర్యాటక శాఖ బస్సులోనే హైదరాబాద్‌కు తీసుకెళ్తారు. సాగర్‌ నుంచి ఒక వైపునకు మాత్రమే ప్రయాణించే పర్యాటకులకు లాంచీలో మధ్యాహ్న భోజన సదుపాయం మాత్రమే కల్పిస్తారు.