పవన్ ఎఫెక్ట్..? : రాజధానిలో బాలకృష్ణ పర్యటన వాయిదా

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. గురువారం(జనవరి 16,2019) ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని

  • Published By: veegamteam ,Published On : January 16, 2020 / 01:50 PM IST
పవన్ ఎఫెక్ట్..? : రాజధానిలో బాలకృష్ణ పర్యటన వాయిదా

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. గురువారం(జనవరి 16,2019) ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. గురువారం(జనవరి 16,2019) ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతారని వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. బాలయ్య బాబు అమరావతికి వెళ్లలేదు. అనివార్య కారణాలతో బాలయ్య తన పర్యటనను రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 18న అమరావతిలో పర్యటిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి బాలయ్య బాసటగా నిలుస్తారని వెల్లడించాయి.

షెడ్యూల్ ప్రకారం.. జనవరి 16న అమరావతి ప్రాంతంలో బాలయ్య పర్యటించాల్సి ఉంది. ఆయనతో పాటు భార్య వసుంధర, పెద్ద కూతురు బ్రాహ్మణి, అల్లుడు లోకేశ్ కూడా రానున్నారని… తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల్లో నిరాహార దీక్ష శిబిరాలను సందర్శించి.. రైతుల నిరసనలకు, ధర్నాలకు మద్దతు ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఉన్నట్లుండి ఆయన తన పర్యటనను రెండు రోజులు వాయిదా వేసుకున్నారు. చివరి నిమిషంలో బాలకృష్ణ తన పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారు? అనేది రాజధాని రైతులతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు నేటితో (జనవరి 16,2020) 30వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు వెలగపూడిలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పండగ పూట కూడా పస్తులుండి రైతులు నిరసనలు తెలిపారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం సహా ఇతర గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధానిని మూడు ముక్కలు చేయొద్దని, అమరావతినే కేపిటల్ గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

నెల రోజులుగా రాజధాని ప్రాంతం అమరావతి.. ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు, శ్రేణులు అమరావతి ప్రాంత ప్రజలకు అండగా నిలిచారు. ఉద్యమానికి మద్దతు తెలిపారు. చంద్రబాబు.. ప్రతీ రోజు రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాజధానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబం మొత్తం రాజధాని ఆందోళనలో బిజీగా ఉంది. నారా రోహిత్, నిర్మాత అశ్వనీదత్, పాప్ సింగర్ స్మిత సైతం రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. కానీ చంద్రబాబు వియ్యంకుడు, టీడీపీ కీలక నేత, నందమూరి ఎన్టీ రామారావు తనయుడు, హీరో బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు రాజధాని అంశంపై తన స్పందన తెలపలేదు. దీనిపై పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. బాలయ్య తీరుపై విమర్శలు వచ్చాయి.

దీంతో.. సంక్రాంతి మర్నాడు అంటే జనవరి 16న.. రాజధాని ప్రాంతంలో పర్యటించాలని, రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తున్న ప్రజలు, రైతులకు సంఘీభావం ప్రకటించాలని బాలకృష్ణ అనుకున్నారు. కానీ.. సడెన్ గా పర్యటనను రద్దు చేసుకున్నారు. రెండు రోజుల పాటు వాయిదా వేశారు. బాలయ్య తన పర్యటన వాయిదా వేసుకోవడానికి ఏపీ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలే కారణం అని తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై పార్టీలో చర్చించాకే అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే మంచిదని బాలయ్య భావించినట్లు టీడీపీ వర్గాల సమాచారం.

బాలయ్య వస్తున్నాడని తెలిసి అమరావతి ప్రాంత రైతుల, అమరావతిలో బాలయ్య అభిమానులు ఆనందపడ్డారు. ఇంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. మరి ఈ నెల 18న అయినా.. బాలయ్య తన మాట నిలుపుకుంటారో లేదా.. అమరావతిలో పర్యటిస్తారో లేదో చూడాలి. కాగా, అమరావతి ప్రాంతంలో పర్యటిస్తే.. రాజధాని గురించి బాలయ్య ఏం మాట్లాడతారు? ఎలాంటి స్పందన తెలుపుతారు? సీఎం జగన్ పై ఎలాంటి విమర్శలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : 2024లో అధికారం మాదే : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిశా