Lokesh On Power Holiday : ప‌వ‌ర్‌ హాలిడే ఎత్తేయండి, కొనఊపిరితో ఉన్న ప‌రిశ్రమలను ఆదుకోండి- సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

పవర్ హాలిడేతో 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప‌రిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి త‌ర‌లిపోతున్నాయి.(Lokesh On Power Holiday)

Lokesh On Power Holiday : ప‌వ‌ర్‌ హాలిడే ఎత్తేయండి, కొనఊపిరితో ఉన్న ప‌రిశ్రమలను ఆదుకోండి- సీఎం జగన్‌కు లోకేష్ లేఖ

Lokesh On Power Holiday

Lokesh On Power Holiday : తీవ్రమైన విద్యుత్ కొరత నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పక్షాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేసింది. పవర్ హాలిడేపై సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ లేఖాస్త్రం సంధించారు. పరిశ్రమలు, ఉపాధి క‌ల్పనా రంగాల‌ను సంక్షోభంలోకి నెట్టే ప‌వ‌ర్‌ హాలిడేని ఎత్తేయాలంటూ లేఖలో సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటున్న సమయంలో పవర్ హాలిడే పాటించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల‌తో అన్ని రంగాలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయని లోకేశ్ వాపోయారు.

” మీరు ప్రతిపక్ష నేత‌గా ఉన్నపుడు కనీసం క‌రెంటు చార్జీలు ఒక్కసారి కూడా పెంచ‌ని టీడీపీ ప్రభుత్వంపై.. ఎంతెంత బిల్లులు వేస్తారంటూ అవాస్తవాలు ప్రచారం చేశారు. మీరు అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లలోనే 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ‎ఇచ్చారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాక విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు. మీ అవగాహనారాహిత్యం, అనుభవలేమితో విద్యుత్ కొర‌త ఏర్పడి ఏకంగా ప‌రిశ్రమలకు ప‌వ‌ర్‌ హాలీడే ప్రకటించే వ‌ర‌కూ దారి తీసింది.(Lokesh On Power Holiday)

ఓవైపు క‌రెంటు కోతలు, మ‌రోవైపు ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఏపీలో అధికంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు వల్ల ‎జ‌న‌రేట‌ర్లు న‌డ‌ప‌లేక కుటీర‌, చిన్న ప‌రిశ్రమల నుంచి పెద్ద ప‌రిశ్రమ‌ల వ‌ర‌కూ అన్నీ మూతపడే దిశ‌గా సాగుతున్నాయి. మీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి‎ ఒక్క ప‌రిశ్రమ రాకపోగా వైసీపీ నేతల వేధింపులు, జే ట్యాక్స్, ఇప్పుడీ ప‌వ‌ర్ హాలీడేతో ఉన్న ప‌రిశ్రమలు పొరుగు రాష్ట్రాలకి త‌ర‌లిపోతున్నాయి.

AP Power Holiday : ఏపీలో పరిశ్రమలకు షాక్.. రేపటి నుంచి పవర్ హాలిడే

విద్యుత్‌ కోతలతో గ్రానైట్‌, ఆక్వా, పౌల్ట్రీ, వ‌స్త్ర‌, ఆహార‌ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. మీరు ప్రకటించిన పవర్ హాలిడే వల్ల అన్ని రంగాల‌కీ చెందిన‌ 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులతో స‌మీక్షించి ప‌వ‌ర్ హాలీడేని ఎత్తేసే మార్గం ఆలోచించండి. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెను భారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు దోచుకునే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని కొనఊపిరితో ఉన్న ప‌రిశ్రమలని కాపాడండి” అని లేఖలో సీఎం జగన్ ను కోరారు నారా లోకేశ్.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు తారస్థాయికి చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో గంటల తరబడి పవర్ కట్ చేస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడీ విద్యుత్ కోతల ప్రభావం పరిశ్రమలనూ తాకింది. విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. వీకెండ్ తో పాటు మరో రోజు అదనంగా సెలవు ప్రకటించాలని.. 24 గంటలూ నడిచే పరిశ్రమలు కూడా 50శాతం విద్యుత్ వినియోగించుకోవాలని ఆదేశించింది.(Lokesh On Power Holiday)

రాష్ట్రంలో ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ పవర్ హాలీడే ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలు రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తులపై తీవ్రప్రభావం చూపే అవకాశముందని, కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి పవర్ హాలిడే ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.

కాగా, వేస‌వి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిన నేప‌థ్యంలో గృహావ‌స‌రాల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండేందుకే.. ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడే ప్ర‌క‌టిస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు వివరించారు.