Yuvagalam : నేడు నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ

టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టనున్న పాదయాత్ర ఇవాళ ఉదయం 11.03 గంటలకు ప్రారంభమవుతుంది. కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద పాదయాత్ర తొలి అడుగు పడనుంది. సాయంత్రం 3గంటల సమయంలో కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Yuvagalam : నేడు నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం.. మధ్యాహ్నం భారీ బహిరంగ సభ

Nara Lokesh

Yuvagalam : తెలుగుదేశం పార్టీ యువ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర 400 రోజుల‌పాటు 4వేల కిలో మీటర్ల మేర సుదీర్ఘంగా సాగనుంది. ఇవాళ ఉదయం 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద పాదయాత్ర తొలి అడుగు పడనుంది. సాయంత్రం 3గంటల
సమయంలో కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ వేదికగా లోకేశ్ తొలి ప్రసంగం చేయనున్నారు. ఇదిలాఉంటే తొలిరోజు వరదరాజస్వామి దేవాలయం వద్ద జరిగే పూజా కార్యక్రమంలో, సాయంత్రం 3గంటలకు జరిగే బహిరంగ సభలో లోకేశ్ అత్తామామలు వసుంధర, బాలకృష్ణ‌తో‌పాటు పలువురు కుటుంబ సభ్యులు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొంటారు.

Nara Lokesh Padayatra: రేపటి నుంచి నారా లోకేష్ పాదయాత్ర.. తొలిరోజు ఇలా..

పాదయాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం జరిగే సభను భారీఎత్తున నిర్వహించేలా ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. సభా వేదికపై 300 మంది నాయకులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సభావేదిక వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 400 మంది వాలంటీర్లను మోహరించారు. వీరికితోడు అదనంగా మరో 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండనున్నారు. అయితే, ఈ సభలో నారా లోకేశ్ తో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగిస్తారని తెదేపా వర్గాల సమాచారం.

Nara Lokesh Visited Tirumala : పాదయాత్ర జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్న నారా లోకేశ్

పాదయాత్ర జరిగే 400 రోజులు లోకేశ్ కాన్వాయ్‌లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పక్కనే వాలంటీర్లు బస చేస్తారు. వీరికోసం ప్రత్యేకంగా జర్మన్ షెడ్లు వేసి మంచాలను అందుబాటులో ఉంచారు. అక్కడే భోజన ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర, బహిరంగ సభ వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉంటే ‘యువగళం’ పేరుతో చేపట్టే పాదయాత్రలో భాగంగా తొలిరోజు 8.5 కిలో మీటర్లు లోకేష్ నడుస్తారు. తన పాదయాత్రలో అడుగడుగునా ప్రజలతో మమేకం అవుతూ, కార్యకర్తలు, స్థానిక ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగుతారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో వివిధ వర్గాల ప్రజలతో లోకేష్ మాట్లాడి, వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తారు.