నెల్లూరులో హీరో సూర్య గ్యాంగ్ సినిమా సీన్.. ఈడీ అధికారులం అంటూ ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, ఆభరణాలు దోపిడీ

  • Published By: naveen ,Published On : October 8, 2020 / 11:20 AM IST
నెల్లూరులో హీరో సూర్య గ్యాంగ్ సినిమా సీన్.. ఈడీ అధికారులం అంటూ ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, ఆభరణాలు దోపిడీ

nellore robbery: అతడికి ఆ కుటుంబంపై కోపం. కారణమేంటో తెలియదు కానీ.. రాను రాబను ఆ కోపం పగగా మారింది. ఆ ఇంట్లోని సొమ్మును కాజేసి ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నాడు. అందుకోసం మరో ఇద్దరితో జత కట్టాడు. ఓ ఖతర్నాక్‌ ప్లాన్‌ వేశాడు. ప్లాన్‌ అయితే సక్సెస్‌ అయింది. కానీ..వారం తిరగకముందే పోలీసుల వలకు చిక్కాడు. ఆ ముగ్గురు కటకటాలపాలయ్యారు.

నెల్లూరులో గ్యాంగ్ సినిమా సీన్:
గ్యాంగ్‌ సినిమా గుర్తింది కదూ. అందులో హీరో సూర్య తన గ్యాంగ్‌తో సీబీఐ అధికారులమంటూ ఓ ఇంట్లో రైడ్‌కు వెళ్తారు. అక్కడున్నదంతా దోచుకుని వెళ్లిపోతారు. రీల్‌ లైఫ్‌లో ఇలాంటి సీన్స్‌ సహజం. కానీ..సేమ్‌ టు సేమ్‌…సీన్‌ రియల్‌ లైఫ్‌లోనూ జరిగింది. అయితే ఇక్కడ సీబీఐ అధికారులు కాకుండా…నకిలీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రైడ్‌ చేశారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు భారీగా డబ్బును దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన…నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులం అంటూ ఇంట్లోకి దూరి:
నెల్లూరు నగరంలోని పొగతోటలో ఉన్న మూన్‌ల్యాండ్‌ అపార్ట్‌మెంట్‌లో చెంచురత్నం దంపతులు నివాసం ఉంటున్నారు. చెంచురత్నంకు రియల్ ఎస్టేట్ రంగంలో మధ్యవర్తిగా పని చేసే రాఘవ అనే వ్యక్తితో పరిచయం ఉంది. అతడు అప్పుడప్పుడు చెంచురత్నం ఇంటికి వస్తూ.. పోతూ ఉండేవాడు. సీన్‌కట్‌ చేస్తే…వారం క్రితం రాఘవతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులమంటూ విచారణ పేరుతో చెంచురత్నం ఇంటికి వచ్చారు.

బీరువాలో ఉన్న రూ.10 లక్షలు నగదు, 35 సవర్ల బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు:
దంపతులను వేర్వేరు గదుల్లో ఉంచి బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రి 9 గంటలకు ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు…రాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉన్నారు. ఎక్కడెకక్కడ స్థలాలున్నాయో వాటికి సంబంధించిన పత్రాలు, వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బీరువాలో ఉన్న 10 లక్షలకు పైగా నగదుతో పాటు 35 సవర్ల బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.

మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు:
ఆ క్షణం వరకు అదంతా నిజమేనని అనుకున్న దంపతులు…కొద్దిసేపటి తర్వాత మోసపోయానని తెలుసుకున్నారు. అసలు వచ్చిన వారు అధికారులే కాదని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్ద మొత్తంలో నగదు, బంగారం దోపిడీ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏం జరిగిందని ఆరా తీశారు.

దోపిడీ వెనుక భూ వివాదం:
అలాగే రాఘవతో పాటు వచ్చిన ఇద్దరితో చెంచురత్నంకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో కూపీ లాగారు. చివరకు ఈ దోపిడీ వ్యవహారం వెనుక భూవివాదం ఉన్నట్లు గుర్తించారు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు దోపిడీలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిలో ఓ కానిస్టేబుల్‌ ఉన్నట్లు గుర్తించారు. సినిమా స్టైల్‌లో జరిగిన ఈ ఘటన…నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.