తిరుమలకు వెళ్తున్నారా? మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దైవ

  • Published By: naveen ,Published On : June 7, 2020 / 08:13 AM IST
తిరుమలకు వెళ్తున్నారా? మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దైవ

లాక్ డౌన్ 5వ దశలో కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. తిరుమలలోనూ శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. గతంలోకంటే భిన్నంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తనిఖీలు, టికెట్ల జారీ విషయంలో పలు మార్పులు చేశారు. ఇప్పటిదాకా భక్తులను అలిపిరి టోల్ గేట్ దగ్గర భద్రతా సిబ్బంది భౌతికంగా తనిఖీ చేసేవారు. ఇకపై అలా జరగదు. భక్తులే స్వయంగా తమ జేబులు పూర్తిగా బయటకు తీసి చూపించాలి. ఇక మహిళలు తమ హ్యాండ్ బ్యాగులను తెరిచి చూపించాలి. టీటీడీ సిబ్బంది హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ తో పరిశీలిస్తారు.

* భక్తుల లగేజీ సహా వాహనాలను అలిపిరి దగ్గరే శానిటైజ్ చేస్తారు. 
* దర్శనం టికెట్లు ఉన్నవారినే కొండపైకి అనుమతిస్తారు.
* అందరినీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. రోజుకు 200 నుంచి 300 మంది నుంచి ర్యాండమ్ గా స్వాబ్ నమూనాలు సేకరిస్తారు.
* అలిపిరి దగ్గర 12 వరుసల్లో ప్రవేశ మార్గాలుండగా.. శానిటైజేషన్ కు వీలుగా ఒక రోజు ఆరు, మరుసటిరోజు మిగిలిన ఆరింటిని తెరిచి వాహనాలను అనుమతిస్తారు.
* జూన్ 11 నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకు సుమారు 3 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఆన్ లైన్ లో ముందుగానే జారీ చేస్తున్నారు. * ముందురోజు తిరుపతికి వచ్చి ఆధార్ కార్డుతో పాటు ఐరిస్ ద్వారా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి. 
* ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకు గంటల వారీగా కోటా మేరకు టికెట్లు వచ్చేలా సాఫ్ట్ వేర్ మార్చారు. 
* గంటకు 500 చొప్పున రోజుకు 6 వేల మందికి దర్శనం కల్పించనున్నారు.
* సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్ లోని కౌంటర్ల నుంచి పొందొచ్చు. రద్దీని బట్టి శ్రీనివాసంలోనూ కౌంటర్ తెరిచే అవకాశముంది.
 
తిరుమలకు తొందరపడి రావొద్దు:
శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక సూచన చేశారు. దూరప్రాంతాల నుంచి భక్తులెవరూ తొందరపడి తిరుమలకు రావొద్దని సూచించారు. ముందే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొని వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దూరప్రాంతాల భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లను బుక్ చేసుకుని వస్తే మంచిదని తెలిపారు. ఇవి ఆన్ లైన్ లో విడుదల చేసిన పది పదిహేను నిమిషాల్లోనే అయిపోతున్నాయని, తిరుపతికి వచ్చాక తీసుకుదాంలే అనుకుంటే దొరక్కపోవచ్చన్నారు. సర్వదర్శనం టిక్కెట్లు కూడా తిరుపతి సమీప ప్రాంతాల వారికే అయిపోవచ్చన్నారు. కాబట్టి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడమే అన్ని విధాలుగా మంచిదన్నారు.

పిల్లలను, వృద్ధులను అనుమతించరు:
ఇక అలిపిరి దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌, వాహనాల తనిఖీల అనంతరం దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారని ఈవో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పదేళ్లలోపు చిన్నారులను, 65 సంవత్సరాలు పైబడిన వృద్దులను ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.