New Education Policy : ఏపీలో నూతన విద్యావిధానం, ఉపాధ్యాయ సంఘాలతో కీలక సమావేశం

రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

New Education Policy : ఏపీలో నూతన విద్యావిధానం, ఉపాధ్యాయ సంఘాలతో కీలక సమావేశం

New Education Policy

New Education Policy : రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ప్రతి సంఘం నుంచి అధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ ఈ సమావేశానికి రావాలన్నారు. నూతన విద్యా విధానంపై వారితో కూలంకషంగా చర్చించనున్నారు. ఆయా సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 5 + 3 + 3 + 4 విద్యా విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

రాష్ట్రంలో నూత‌న విద్యావిధానాన్ని అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది. విద్యా విధానంలో స‌మూల మార్పులు తీసుకొచ్చే క్ర‌మంలో జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుస‌రించి రాష్ట్ర ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది.

నూత‌న విధానంలో అమ‌ల్లోకి రానున్న మార్పులు:
* నూత‌న విద్యా విధానంలో భాగంగా ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది.

* ఇందులో భాగంగా మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇక నుంచి ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు. వీటి త‌ర్వాత‌.. ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్‌ స్కూళ్లు (6-8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి.

* ఈ విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలనే ప్ర‌తిపాద‌న ఉంది. ఒకే ప్రాంగ‌ణంలో ఇవి ఉండేలా చూస్తారు. వీటిని ఫౌండేష‌న్ స్కూళ్లుగా ప‌ర‌గ‌ణిస్తారు.

* ఇలా ఏర్పాటు చేసిన ఫౌండేష‌న్ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్‌ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ-1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరుగా ఏర్పాటు చేస్తారు.

* ప్ర‌స్తుతం ప్రాథ‌మిక స్కూళ్ల‌లో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను ద‌గ్గ‌ర‌ల్లోని యూపీ స్కూల్‌ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలని సూచించారు.

* ఇలా అద‌నంగా చేరిన విద్యార్థుల‌తో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు.

* 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.

* విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇలాంటి వాటిని మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటు చేస్తారు.

* ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తారు.

* ఇక ఇంటికి స‌మీపంలో ప్రీ ప్రైమ‌రీ స్కూళ్లు ఉండేలా చూడాలి. ఫౌండేషన్‌ స్కూలు ఒక కిలోమీటర్‌ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.

* టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడాలి.

* ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినా ఎక్క‌డా ఒక్క అంగన్‌వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదు.

* సెకండ‌రీ స్కూళ్ల‌కు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలి.