Direct Cash Transfer : రెండేళ్లలో రూ.లక్ష కోట్లు.. ప్రత్యక్ష నగదు బదిలీలో సరికొత్త రికార్డ్

ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. రెండో ఏడాది వరుసగా చేయూత పథకంతో

Direct Cash Transfer : రెండేళ్లలో రూ.లక్ష కోట్లు.. ప్రత్యక్ష నగదు బదిలీలో సరికొత్త రికార్డ్

Direct Cash Transfer

Direct Cash Transfer : ఏపీ సీఎం జగన్‌ చేపట్టిన పరిపాలనా సంస్కరణల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ప్రక్రియ మరో మైలు రాయిని దాటింది. రెండో ఏడాది వరుసగా చేయూత పథకంతో పాటు గత రెండేళ్ల కాలంలో వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,00,116.35 కోట్లను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసి రికార్డు సృష్టించింది. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు 6,53,12,534 ప్రయోజనాలను పొందారు. రెండేళ్ల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అర్హులైన పేదల బ్యాంకు ఖాతాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.

అవినీతి, లంచాలకు ఆస్కారం లేకుండా దుర్వినియోగం అనే మాట వినిపించకుండా ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసింది. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ప్రమాణికంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ జరిగింది.

జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను స్వయంగా చూసి, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న కీలక నిర్ణయాలు కోట్లాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా, పేదరికమే కొలమానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గ్రామ స్థాయిలోకి పాలనను తీసుకెళ్లేందుకు విప్లవాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, లక్షల సంఖ్యలో వలంటీర్లను సిద్ధం చేసి, ప్రజల గడపకే ప్రభుత్వ సేవలను తీసుకొచ్చారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్న సీఎం జగన్‌ ఆదేశాలతో, దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే ఆయా పథకాలను చేరువ చేశారు. వలంటీర్లు.. సచివాలయాల్లో అందచేసిన దరఖాస్తులను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరించడం, లబ్ధిదారుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్‌ ఆడిట్‌ చేస్తున్నారు. ఎక్కడైనా అర్హులు తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే, వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియగా మార్చారు. సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ పని చేస్తున్నారు. ప్రతి పథకం ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నారో ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తున్నారు. కేవలం అర్హత మాత్రమే ప్రాతిపాదికన సీఎం జగన్‌ ప్రభుత్వ పథకాల అమలులో సంస్కరణలు తీసుకొచ్చారు.

సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత:
* పిల్లలను స్కూళ్లకు పంపుతున్న 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా రూ.13,022.93 కోట్లు జమ.
* విద్యార్థుల కోసం అమలు చేస్తున్న జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మంది తల్లుల ఖాతాలకు రూ.2,269.93 కోట్లు, విద్యా దీవెన కింద 18,80,934 మంది తల్లుల ఖాతాలకు రూ.4,879.30 కోట్లు జమ.
* వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాల మహిళలు 98,00,626 మందికి రూ.2,354.22 కోట్లు
* వైఎస్సార్‌ చేయూత కింద 24,55,534 మంది మహిళలకు రూ.8943.52 కోట్లు
* వైఎస్సార్‌ ఆసరా కింద 77,75,681 మంది మహిళలకు రూ.6,310.68 కోట్లు
* వైఎస్సార్‌ కాపునేస్తం కింద 3,27,862 మంది మహిళలకు రూ.491.79 కోట్లు నేరుగా ప్రభుత్వం జమ చేసింది.