కరోనా ఎఫెక్ట్.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కొత్త రూల్

కరోనా ఎఫెక్ట్.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు కొత్త రూల్

Vijayawada Railway Station

Vijayawada Railway Station : ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించడం లేదు. ప్రయాణికులకు కంపూట్యరైజ్డ్ థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలను శానిటైజ్ చేస్తున్నారు.

ఏపీలో మళ్లీ 4 వేలు దాటిన కరోనా కేసులు:
ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిలకడగా దాదాపు 4 వేల కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటల్లో మరోసారి అదే రికార్డు నమోదైంది. ఒక్కరోజే 4వేల 157 కొత్త కేసులు వెలుగుచూశాయి.తూర్పుగోదావరిలో అత్యధికంగా 617 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత శ్రీకాకుళం 522, చిత్తూరు 517, గుంటూరు 434, విశాఖ 417, కర్నూలు 386 ఉన్నాయి. 300 కంటే తక్కువ కేసులున్న జిల్లాల్లో అనంతపురం 297, నెల్లూరు 276, ప్రకాశం 230, విజయనగరం 154, కృష్ణా 135, కడప 112, పశ్చిమగోదావరి 60 ఉన్నాయి.

24 గంటల్లో 18 మరణాలు:
వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ నమోదైన పాటిజివ్‌ కేసుల సంఖ్య 9.37 లక్షలకు చేరింది. ఇందులో 9 లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 28 వేల యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 7వేల 339మంది చనిపోయారు. ఇందులో గత 24 గంటల్లో 18మంది చనిపోయారు. నెల్లూరులో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, అనంత, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు‌, ప్రకాశం, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.