చంద్రబాబు పదవులు ఇచ్చినా ఆనందంగా లేరు, తెగ బాధపడుతున్న విజయనగరం సీనియర్లు

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 04:15 PM IST
చంద్రబాబు పదవులు ఇచ్చినా ఆనందంగా లేరు, తెగ బాధపడుతున్న విజయనగరం సీనియర్లు

vizianagaram tdp senior leaders: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్లకు కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం లభించిందని ఆ పార్టీ శ్రేణులు ఒక పక్క సంబరపడుతుంటే.. మరోపక్క పదవులు పొందిన సీనియర్లు మాత్రం సైలెంట్‌ అయిపోయారని అంటున్నారు. అదేంటి పదవులొస్తే సంతోషించాలి గానీ.. అలా ఎందుకు డీలా పడుతున్నారా అని కేడర్‌ ఇప్పుడు అయోమయంలో పడిపోయిందని చెబుతున్నారు.

విజయనగరం జిల్లా నేతలకు కీలక పదవులు:
ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ కార్యవర్గంలో విజయనగరం జిల్లా నేతలకు కీలక పదవులను కట్టబెట్టింది. సీనియర్ నేత, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావుకు ఉపాధ్యక్షుడి పదవిని కట్టబెట్టగా, అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌ను నియమించింది. కార్యదర్శులుగా భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, తాడంగి కేశవరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, బొబ్బిలికి చెందిన మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, కోళ్ల రాంప్రసాద్, గజపతినగరానికి చెందిన కరణం శివరామకృష్ణకు అవకాశమిచ్చింది.


https://10tv.in/ap-government-alerts-with-dubbaka-result/
ఆ పదవులు తమ భవిష్యత్‌కు అడ్డంకిగా మారతాయోనని టెన్షన్‌:
అన్ని వర్గాలకు ప్రాధాన్యాన్ని ఇస్తూ పదవులను కట్టబెట్టిందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు ఆ పదవులు తమ భవిష్యత్‌కు ఎక్కడ అడ్డంకిగా మారతాయోనని టెన్షన్‌ పడుతున్నారని టాక్‌. అసలు విషయం ఏమిటంటే… రాష్ట్ర కమిటీలో పదవులు దక్కిన వారందరికీ… రేపటి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవులు దక్కే అవకాశాలు ఉండవేమోనని తెగ హైరానా పడుతున్నారని అంటున్నారు. రాష్ట్ర పదవులు దక్కడంతో ఇక నుంచి జిల్లా పార్టీలో తమకి ప్రాధాన్యం తగ్గిపోతుందనే దిగులు పట్టుకుందని చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఉన్నవారికే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయన్నది రివాజుగా ఉంది. అలాంటప్పుడు ఇక తాము ఎమ్మెల్యే అభ్యర్థుల రేసులో లేనట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోందట.

భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్న బంగార్రాజు:
నెల్లిమర్ల నియోజకవర్గంలో చూసుకుంటే… నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం ఎప్పటి నుంచో భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు కర్చీఫ్ వేసుకొని కూర్చొన్నారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ కోసం తెగ ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు తన్నుకుపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినా… ఎందుకనో మళ్లీ వెనుకడుగు వేశారు. ఈ విషయం అధిష్టానం దృష్టికి సైతం వెళ్లింది. ప్రస్తుతం ఆయనను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో కంగుతిన్నారట. ఇప్పుడు భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారని అంటున్నారు.

ఆందోళనలో మహంతి చిన్నంనాయుడు:
ఇదే నియోజకవర్గానికి చెందిన మహంతి చిన్నంనాయుడు పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో పార్టీని ముందుకు నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనను రాష్ట్ర కమిటీలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పదవి ఇచ్చి… పక్కకి తోసేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కావాలనే సుజయను రాజకీయాల నుంచి తప్పించారా?
బొబ్బిలి నియోజకవర్గం విషయానికొస్తే… సుజయకృష్ణ రంగారావును రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడం చర్చనీయాంశమైంది. ప్రతీసారి బొబ్బిలి నుంచి పోటీ చేసే సుజయ్‌ను ఈసారి కావాలనే జిల్లా రాజకీయాల నుంచి తప్పించారని అంటున్నారు. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సుజయ్ సోదరుడు బేబీనాయన కొనసాగుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బేబీ నాయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

కరణం శివరామకృష్ణకు మరోసారి నిరాశ:
గజపతినగరం నియోజకవర్గం సీనియర్ నేత కరణం శివరామకృష్ణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిపై ఎప్పటి నుంచో కన్నేశారు. కానీ, ఆయనకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు రూపంలో అడ్డంకి ఉంది. ఆరేళ్లుగా శివరామకృష్ణ రాష్ట్ర కమిటీలో పని చేస్తున్నారు. తాజాగా, మరోసారి ఆయనకు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చోటు దక్కడంతో నిరాశగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేఏ నాయుడు కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు.

కేఏ నాయుడు తిరుగుబావుటా:
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆశించిన కేఏ నాయుడు… ఆ పదవిని కిమిడి నాగార్జునకు ఇవ్వడంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుపై కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు తప్పకుండా అవకాశం వస్తుందని శివరామకృష్ణ ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో తనను నియమించినా భవిష్యత్‌లో తనకి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి గ్యారెంటీగా వస్తుందన్న ఆశతో ఉన్నారు.

లోలోపలే కుమిలిపోతున్న సీనియర్లు:
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులుకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనని కాదని, మరెవరికైనా టికెట్‌ ఇస్తారేమోనన్న ఆందోళన చెందుతున్నారట. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడమంటే… జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం తగ్గించడమేనన్న సంకేతాలతో ప్రస్తుతం ఈ సీనియర్లంతా టెన్షన్‌ పడుతున్నారని చెబుతున్నారు. తమ అనుచరులకు, కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక… పాపం ఈ సీనియర్లు లోలోపలే కుమిలిపోతున్నారట.

https://www.youtube.com/watch?v=I_LhWhliX_0