కీలక పరిణామం : ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం

  • Published By: madhu ,Published On : December 13, 2019 / 11:35 AM IST
కీలక పరిణామం : ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఆయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. తమ కూతురికి న్యాయం జరుగుతుందంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమని తల్లిదండ్రులు ప్రకటించారు.  

మృతదేహాన్ని పూడ్చిపెట్టి 12 ఏళ్లు అయిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని, వాటికి పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల వద్ద డీఎన్ఏ‌ను కూడా సేకరించారు అధికారులు.

ఆయేషా డీఎన్‌ఏ టెస్ట్‌కు ఆమె మతపెద్దలు అంగీకరించలేదు. దీంతో సీబీఐ కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్నారు అధికారులు. టెస్టులకు తాము సహకరిస్తామని ఆయేషా తల్లిదండ్రులు తెలిపారు. ఈ కేసును చేపట్టినప్పటి నుంచీ సీబీఐ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది.

ఒక్కో కోణంలో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జనవరిలో.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబును ప్రత్యేకంగా ప్రశ్నించింది. అతని ఇంటికే వెళ్లి కేసుపై గుచ్చి గుచ్చి అడిగింది సీబీఐ టీమ్‌. 
ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా దృష్టిపెట్టింది సీబీఐ టీమ్‌.

అయేషా మీరా హత్య సమయంలో పనిచేసిన పోలీసులనూ సీబీఐ టీమ్ ప్రశ్నించింది. కానిస్టేబుళ్లు రామారావు, శంకర్‌, రాధాల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.  హత్య జరిగిన సమయంలో దర్యాప్తు జరిగిన తీరు, సేకరించిన ఆధారాల గురించి వివరాలను తీసుకుంది. కొన్ని కీలక ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపైనా ప్రశ్నించింది. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఘటనాస్థలంలో దొరికిన ఆనవాళ్లపై సీబీఐ ప్రత్యేక నివేదిక సిద్ధం చేసినట్లుగా  తెలుస్తోంది. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులు విజయవాడ కోర్టులో అనుమానాస్పదస్ధితిలో కాలిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించింది. దీనిపై ఇప్పటికే సీబీఐ.. విజయవాడ కోర్టు సిబ్బందిపై రెండు కేసులు నమోదు చేసింది.

2007 డిసెంబర్‌ 27న ఆయేషా మీరా హత్యకు గురైంది. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. హత్య జరిగి 12 సంవత్సరాలు గడుస్తున్నా కేసు మాత్రం కొలిక్కిరాలేదు. 

* కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. 
* ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
* కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. 
* కేసును విచారించిన పోలీసులు.. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు. 
* 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. సత్యంబాబును దోషిగా తేల్చింది. 
* అయితే..ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 
* ఆయేషాను బరియల్ గ్రౌండ్‌లో ఖననం చేశారు. 
* తాజాగా రీ పోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ అధికారుల భావిస్తున్న క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి. 
Read More : దిశ చట్టం : అత్యాచారం చేస్తే మరణశిక్షే