నా పేరు, కులంతో హర్షకుమార్ రాజకీయం చేస్తున్నారు.. రాష్ట్రంలో సంచలనం రేపిన దళితుడి శిరోముండనం కేసులో ట్విస్ట్

  • Published By: naveen ,Published On : July 25, 2020 / 12:57 PM IST
నా పేరు, కులంతో హర్షకుమార్ రాజకీయం చేస్తున్నారు.. రాష్ట్రంలో సంచలనం రేపిన దళితుడి శిరోముండనం కేసులో ట్విస్ట్

రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళితుడి శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ కుమార్ తన వెర్షన్ వినిపించాడు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించాడు. తనకు ప్రమాదం జరిగిన సమమంలో అక్కడ శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి వరప్రసాద్ లేడని చెప్పాడు. అసలు తనను లారీ ఢీకొట్టలేదని, బైక్ పైనుంచి తానే కింద పడ్డానని చెప్పాడు. బైక్ అదుపు తప్పడం వల్లే కింద పడ్డాను కానీ ఇసుక లారీ వల్ల కాదని స్పష్టం చేశాడు. ప్రమాదంలో గాయపడిన నేనూ దళితుడినే, కానీ నన్ను పరామర్శించడానికి ఒక్క నాయకుడూ రాలేదన్నాడు. తన పేరుని, కులాన్ని వాడుకుని రాజకీయం చేస్తున్నారని విజయ్ ఆరోపించాడు.

అసలేం జరిగిందంటే:
దళితుడి శిరోముండనానికి ప్రధాన కారణం సీతానగరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదమే కారణం అని వార్తలు వచ్చాయి. రోడ్డు ప్రమాదంలో విజయ్ బాబు అనే వ్యక్తి గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించే సమయంలో స్థానిక వైసీపీ నేతకు, వరప్రసాద్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కొట్లాటకు కూడా దారితీసింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో పంచాయతీ వరకు వెళ్లింది. ఈ క్రమంలో బాధితుడు ప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే ఎస్ఐ సమక్షంలోనే శిరోముండనం చేయించారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. రాజకీయ, కులం రంగు పులుముకుంది. ఈ ఘటనపై సీఎం జగన్ కూడా సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ప్రశ్నించినందుకే వైసీపీ నేతలు ఆగ్రహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. సీతానగరానికి చెందిన దళితుడు వరప్రసాద్‌ను వైసీపీ నేతల ఒత్తిడితోనే పోలీసుల చితకబాది, శిరోముండనం చేయించారని, ఇది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సీఎం జగన్ దళిత వ్యతిరేకి అని విరుచుకుపడ్డారు.

కాగా, రోడ్డు ప్రమాదంలో గాయపడిన విజయ్ ఇప్పుడు గాయాల నుంచి కోలుకున్నాడు. అసలేం జరిగిందో చెప్పాడు. రోడ్డు ప్రమాదం జరిగిన ఆ రోజు అసలు శిరోముండనం బాధితుడు వరప్రసాద్ స్పాట్ లోనే లేడని చెప్పాడు. అసలు ఏ ఇసుక లారీ తనను ఢీకొట్టలేదన్నాడు. మద్యం మత్తులో ఉన్న తాను అదుపుతప్పి బైక్ పైనుంచి కింద పడినట్టు చెప్పాడు. అయితే కొందరు రాజకీయ నాయకులు, వరప్రసాద్.. తన పేరుని, కులాన్ని వాడుకుని రాజకీయం చేస్తున్నారని విజయ్ ఆరోపించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తాను కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాడినే అయినా, ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా తనను పరామర్శించ లేదన్నాడు. వరప్రసాద్ ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విజయ్ బాబు ఆరోపించాడు.