నివార్ తుపాన్ : జగన్ ఏరియల్ సర్వే, మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు

  • Published By: madhu ,Published On : November 29, 2020 / 07:43 AM IST
నివార్ తుపాన్ : జగన్ ఏరియల్ సర్వే, మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షలు

CM Jagan Aerial Survey : నివార్‌ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలోనూ.. పంట నష్టం నివేదిక రూపకల్పనలోనూ మానవతా దృక్పథంలో వ్యవహరించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 15లోగా తుపాను నష్టంపై నివేదిక అందజేయాలన్నారు. అదేనెల 31లోగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుపాను బారినపడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని ఆదేశించారు.



ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద నష్టంపై 2020, నవంబర్ 28వ తేదీ శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. స్వయంగా ముఖ్యమంత్రే వరదలు, పంటనష్టాన్ని పరిశీలించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో తుపాన్‌ నష్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివార్‌ తుపాను కలిగించిన నష్టాల అంచనాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద, పంట నష్టంపై డిసెంబర్‌ 15లోగా నివేదికలు అందజేయాలని జగన్‌ ఆదేశించారు. అదేనెల 31వరకు బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.



తుపాను బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఒక్కో కుటుంబానికి 5లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపారు. వర్షాలు, వరదలతో నిరాశ్రయులై పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న ప్రతి ఒక్కరికీ 500 చొప్పున తక్షణ సాయం అందజేయాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణం 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని సూచించారు. రోడ్లు, చెరువులు దెబ్బతిన్న చోట్ల వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వరదలతో దెబ్బతిన్న కడపలోని ఫించా, అన్నమయ్య ప్రాజెక్ట్‌ పనులను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.



నివార్‌ తుపాను రైతులను ముంచిన కష్టం అంతాఇంతా కాదు. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్‌లో వేసిన పంటలను సెప్టెంబరు, అక్టోబర్‌లో విజృంభించిన వరదలు, వర్షాలు భారీగా దెబ్బతీశాయి. ఇప్పుడు నివార్‌ తుపానుతో అన్నదాతకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల హెక్టార్లలో పంటనష్టపోయినట్టుగా తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి చిత్తూరు జిల్లా వరకు వేలాది ఎకరాల్లో వరి చేలు ఈదురుగాలికి నేలవాలాయి. కోసిన వరి పనులు నీటిలో నానుతున్నాయి. మినుము, పెసర కోయకపోయినా.. కాయ పగిలి, గింజ మొలకెత్తుతోంది. మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జలాంటి పంటలు కూడా తడిసిపోయాయి. పశ్చిమ కృష్ణా, పలు జిల్లాల్లో పత్తి తీయడానికి వీల్లేకుండా తడిసి ముద్దలుగా మారింది. ఇక ఈదురుగాలులకు అరటి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి.



రైతులను ఈ ఏడాది వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. నివార్‌ తుపాను దెబ్బనుంచి కోలుకోకముందే రైతులకు మరో రెండు ఉపద్రవాలు పొంచి ఉన్నాయి. నిన్న హిందూ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా… ఆ తర్వాత నాలుగు రోజుల్లో తుపానుగా మారనుంది. మరో తుఫాను కూడా వచ్చే అవకాశమూ ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. సోమవారానికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశముంది.