ఏపీపై నివార్ ప్రభావం : విలవిల్లాడిన మూడు జిల్లాలు

  • Published By: madhu ,Published On : November 27, 2020 / 08:11 AM IST
ఏపీపై నివార్ ప్రభావం : విలవిల్లాడిన మూడు జిల్లాలు

Nivar Impact on AP : నివార్‌ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను అతలాకుతం చేశాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద ప్రవహించింది.



చిత్తూరు జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో తూర్పు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాలా చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. చిత్తూరు నగరంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కింద చెన్నారెడ్డికాలనీలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అప్పటికే కార్యాలయంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌, మరో నలుగురు సిబ్బంది బయటకు రాలేక ఆందోళన చెందారు.
నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. గూడూరు – మనుబోలు మధ్యలో ఆదిశంకర కళాశాల వద్ద చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి.



https://10tv.in/cyclone-nivar-weakens-hundreds-of-trees-fell-in-tamil-nadu/
కైవల్యా నది ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలో స్తంభాలు నేలకూలి విద్యుత్తుశాఖకు సుమారు 90 లక్షల నష్టం వాటిల్లింది. కడప జిల్లాపైనా నివార్‌ తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, కమలాపురం నియోజకవర్గాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షపాతం నమోదైంది. కమలాపురం, రాయచోటి, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు భారీగా పంట నష్టం జరిగింది. కుక్కలదొడ్డి, ఊటుకూరు సమీపంలో కడప-రేణిగుంట ప్రధాన రహదారి కోతకు గురైంది.



కుండపోత వానలతో ప్రకాశం జిల్లా తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించింది. అత్యధికంగా ఉలవపాడులో 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఉలవపాడు, నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి, కందుకూరులోని ఓగూరు ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు విరిగి పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, రామచంద్రపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జోరు వానలు కురిశాయి. మన్యం, కోనసీమలోనూ జోరువాన పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 మండలాల్లో అధికవర్షపాతం నమోదైంది.