వెంకన్నపై భక్తి ఉంటే చాలా..డిక్లరేషన్ ఎందుకు ? చట్టం ఏమి చెబుతోంది ?

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 09:46 AM IST
వెంకన్నపై భక్తి ఉంటే చాలా..డిక్లరేషన్ ఎందుకు ? చట్టం ఏమి చెబుతోంది ?

TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమవుతోంది. వెంకన్నపై భక్తి ఉంటే చాలు, ఇక డిక్లరేషన్ ఎందుకని కొందరు అంటుండగా, చట్టబద్ధమైన ఈ డిక్లరేషన్‌ను అవసరం లేదంటూ టిటిడి చైర్మన్ చేసిన వ్యాఖ్యలను మరికొందరు తప్పుపడుతున్నారు.



అసలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలా? ఇది కేవలం ఆప్షనా? లేక తప్పనిసరా? అసలు చట్టం ఏమి చెబుతోంది. తిరుమల శ్రీవారి ఆలయ పాలనా వ్యవహారాలు టీటీడీ చేతికి వచ్చాక సంస్థాగతంగా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. టీటీడీ హిందూ మతానికి చెందిన ఓ స్వతంత్ర సంస్థగా అవతరించింది. అసెంబ్లీ ద్వారా ఆ మేరకు చట్టం చేయబడింది.

ఈ క్రమంలోనే హిందూయేతరులకు శ్రీవారి దర్శనం అంశం తెరపైకి వచ్చింది. అప్పుడే దేవాదాయ చట్టంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ చట్టం, జీవో ఎంఎస్ నంబర్ 311 లోని రూల్ నంబర్ 16ను అనుసరించి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి. 1990లోనే దీనిని చట్టంగా చేశారు.



దర్శనానికి వెళ్లే ముందే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే హిందూయేతరులు ఈ డిక్లరేషన్ పత్రం ఇవ్వాలి. తమకు హిందూ మతం పట్ల, శ్రీవెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉందని సంతకం చేసి దర్శనానికి వెళ్ళాలి. అన్యమతస్తులు దర్శనానికి వెళుతున్నారని స్పష్టంగా తెలిసినప్పుడు, వారిని నిలువరించి వారి చేత తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకోవాలని కూడా చట్టం చెబుతోంది. అయితే చట్టంలో ఉన్నప్పటికీ డిక్లరేషన్ అంశం అమలవుతోందా… లేదా… అన్నది తాజా ప్రశ్న…

నిత్యం వేలల్లో, లక్షల్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వస్తుంటారు. పేరు పేరునా వీరి మతాన్ని గుర్తించి ఆలయంలోకి పంపడం ఏమాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఈ కారణంగానే ఈ డిక్లరేషన్ అంశం మూలన పడిందని చెప్పక తప్పదు. అయితే గతంలో కొందరు ప్రముఖులు శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.



ముఖ్యంగా 2006లో నాటి యూపీఏ అధ్యక్షురాలి హోదాలో సోనియాగాంధీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. హిందూయేతురాలు అయిన ఆమె డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు పెడతారా? లేదా? అన్న చర్చ ఆనాడు బలంగా వినిపించింది. ఆలయంలోని క్యూ కాంప్లెక్స్ మార్గంలోనే సోనియాగాంధీకి కనిపించేలా డిక్లరేషన్ పత్రాలను టీటీడీ అధికారులు ఉంచారు కూడా. అయితే అవేవి పట్టించుకోకుండా సోనియాగాంధీ తిరుమల శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని బయటకు వచ్చారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వివాదం చెలరేగింది. ఆయనను క్రైస్తవుడిగా చిత్రీకరిస్తూ డిక్లరేషన్ పై సంతకం చేసి ఆలయంలోకి వెళ్లాలి అంటూ నాడు టీడీపీ డిమాండ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి అంశంలోనూ టీడీపీ చాలాకాలంగా ఈ డిమాండ్ చేస్తోంది.



మరోవైపు శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తి.. స్వామిపై నమ్మకం ఉంటే చాలన్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి. ఎంతో మంది ఇతర మతస్తుల్లోని భక్తులు వెంకన్నను దర్శించుకుంటున్నారని అందులో వారిని గుర్తించి డిక్లరరేషన్ తీసుకోవడం సాధ్యం కాదన్నారు.

టీటీడీ ఛైర్మన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. వ్యక్తుల కోసం తిరుమలలో సంప్రదాయాలు మార్చొద్దంటూ డిమాండ్ చేస్తోంది. అన్యమతస్తులు ఎవరు వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. ఎన్నో సంవత్సరాలు వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించొద్దని కోరారు.



రాజకీయంగా ఈ డిక్లరేషన్ అంశం అప్పుడప్పుడూ తెరపైకి రావడం రివాజుగా మారింది. డిక్లరేషన్ అంశం గురించి చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, అమలు సాధ్యం కాకపోవడంతో ఈ అంశం మూలన పడిందని చెప్పక తప్పదు.