వైసీపీని ఢీకొట్టేవారే లేరా? : అక్కడ టీడీపీకి దిక్కెవరు? 

  • Published By: sreehari ,Published On : January 21, 2020 / 02:56 PM IST
వైసీపీని ఢీకొట్టేవారే లేరా? : అక్కడ టీడీపీకి దిక్కెవరు? 

అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోఅటు వైసీపీ, తెలుగుదేశం పార్టీ పోటా పోటీగా ఉన్నాయి. పార్టీల్లోని నాయకులు గానీ, కార్యకర్తలు గానీ సై అంటే సై అనే పరిస్థితిలో ఉండేవారు. సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఆ పార్టీ తరఫున వైసీపీతో సై అనడానికి నాయకులెవరూ లేరంటున్నారు.

నియోజకవర్గంలో పార్టీని నడిపించే బాధ్యత ఇవ్వాలని అధిష్టానంతో ఒకప్పుడు గొడవకు దిగిన నాయకులు… ఆ బాధ్యత తీసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదట. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్య ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో విసిగిపోయిన కేడర్‌తో పాటు ద్వితీయ శ్రేణి నేతలు దాదాపుగా అధికార పార్టీలోకి జంప్ అయిపోయారు.

కన్నబాబే పెద్ద దిక్కు :
తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో గూటూరు మురళీ కన్నబాబు అండగా నిలిచారు. అన్నీ తానై నియోజకవర్గంలో పార్టీని నడిపించారు. ఆ తర్వాత ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలం తెలుగుదేశం పార్టీకి వెన్నుగా నిలిచారు.

ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలోకి జంప్ అయిన తర్వాత మళ్లీ కన్నబాబే పార్టీకి దిక్కయ్యారు. కొంతకాలానికి టీడీపీ అధిష్టానం ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. ఆయన కొంతకాలం నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారు. ఈ క్రమంలో ఆదాలతో విభేదాల కారణంగా కన్నబాబు పార్టీపై అలకబూనారు. ఆనక ఆదాల కూడా సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి వెళ్లిపోవడంతో మళ్లీ కన్నబాబే తెలుగుదేశానికి నియోజకవర్గంలో పెద్ద దిక్కయ్యారు.

ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కొంతకాలం నియోజకవర్గంలో పార్టీకి అండగా నిలిచినా వారి ప్రభావం అంతంత మాత్రమే. ఇక గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కన్నబాబుకి హ్యాండిచ్చి ప్రముఖ కాంట్రాక్టర్ బొల్లినేని కృష్ణయ్యనాయుడిని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది.

పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లోనూ పోటీ చేయించింది. ఎన్నికలయ్యే వరకు బొల్లినేని కృష్ణయ్య నియోజవర్గంలోనే అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండి ముందుకు నడిపించారు. అయితే ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారని అంటున్నారు.

దిక్కుతోచని స్థితిలో కేడర్ :
అంతక ముందు నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై పార్టీని నడిపించిన కన్నబాబు కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడమే కాక, కనీసం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.

మరోవైపు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా తన నియోజకవర్గం ఆత్మకూరులో రోజురోజుకీ టీడీపీని బలహీనపరిచి వైసీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎక్కువ శాతం మంది ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీలోకి ఆకర్షించారు. ఇప్పటికే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని దాదాపు ఖాళీ చేయించారంటున్నారు. నాయకత్వం లేకపోవడం కేడర్‌ దిక్కుతోచని స్థితిలో ఉంది.