Duggirala MPTC Padmavati : నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్

Duggirala MPTC Padmavati : నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్

Duggirala Mptc Padmavati (1)

Duggirala MPTC Padmavati : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్ష ప‌ద‌వి (ఎంపీపీ) ఎన్నిక ఏపీ రాజ‌కీయాల్లో తీవ్రమైన ఉత్కంఠని, ఆస‌క్తిని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఎంపీపీ ఎన్నికలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చివరికి దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూప‌రాణి ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు.

కాగా, ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దుగ్గిరాల ఎంపీటీసీ తాడిపోయిన ప‌ద్మావ‌తి కిడ్నాప్‌న‌కు గుర‌య్యారంటూ బుధ‌వారం నుంచి వినిపిస్తున్న వార్త‌ల‌పై స‌స్పెన్స్ వీడిపోయింది. గురువారం మ‌ధ్యాహ్నం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పూర్తయ్యాక సాయంత్రం వేళ ఆమె త‌న ఇంటికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న అదృశ్యంపై ఆమె కీల‌క వ్యాఖ్య‌లతో కూడిన ఓ వీడియోను విడుద‌ల‌ చేశారు.

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. తనను కిడ్నాప్ చేశారని తన కుమారుడు రెండురోజులుగా మీడియా ముందు మాట్లాడాడని, కానీ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆమె వెల్లడించారు. పార్టీ ఆదేశాల మేరకే ఎనిమిది మంది ఎంపీటీసీలు క్యాంప్ కి వచ్చామని పద్మావతి వెల్లడించారు. తనను ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షు‌రాలిగా త‌మ పార్టీ త‌ర‌ఫున ఎంపీటీసీగా ఎన్నికైన సంతోషి రూప‌రాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామ‌ని ఆమె తెలిపారు.(Duggirala MPTC Padmavati)

కాగా, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి‌పై వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కుమారుడు తాడిబోయిన యోగేంద్రనాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తన తల్లిని తీసుకెళ్లారని ఆరోపించారు. ఎన్నికల సమయానికి తన తల్లిని ఎమ్మెల్యే ఆర్కే ఎందుకు తీసుకురాలేదు? ప్రశ్నించారు. మా అమ్మను ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారని.. డీజీపీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. మా అమ్మ ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందన్న ఆయన.. కిడ్నాప్‌పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

గంటకో మలుపు తిరుగుతున్న దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక

దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపింది. గెలిచిన ఎంపీటీసీల సంఖ్య ప‌రంగా చూసుకుంటే విప‌క్ష టీడీపీకే మెజారిటీ ఉన్నా… ఎంపీటీసీ ఎన్నిక‌ల త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల‌తో ప‌రిస్థితి తారుమారైంది. గురువారం మ‌ధ్యాహ్నం దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూప‌రాణి ఎన్నిక‌య్యారు. ఎంపీపీగా రూప‌రాణి ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంద‌ని అధికారులు ప్ర‌క‌టించారు.

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల‌లో టీడీపీకి మంచి ప‌ట్టు ఉంది. ఆ ప‌ట్టును నిలుపుకుంటూ ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో దుగ్గిరాల మండ‌లంలో మెజారిటీ సీట్ల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. అయితే ఎంపీపీ ప‌ద‌వి బీసీ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ కాగా… ఆ వ‌ర్గానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో లేక‌పోయారు. దీంతో వైసీపీ త‌న అభ్యర్థిగా సంతోషి రూప‌రాణి అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదిస్తూ బీ ఫామ్ అంద‌జేసింది. రూప‌రాణి అభ్య‌ర్థిత్వం త‌ప్పించి మ‌రెవ‌రి అభ్య‌ర్థిత్వాలు అంద‌క‌పోవ‌డంతో అధికారులు ఆమె ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే దుగ్గిరాల ఎంపీపీగా రూప‌రాణి ప్ర‌మాణస్వీకారం చేశారు.

పరిషత్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత వివిధ కారణాలతో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. 18 ఎంపీటీసీ స్థానాలున్న దుగ్గిరాల ప్రజా పరిషత్‌లో 9 టీడీపీ, 8 వైసీపీ, 1 జనసేన గెలుపొందాయి. దీంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుంతుందోననే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికే రెండుసార్లు ఎంపీపీ ఎన్నిక వాయిదా పడటంతో మూడోసారి జరిగే పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో వైసీపీకి చెందిన రెబల్‌ అభ్యర్థి తాడిబోయిన పద్మావతిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (ఆర్కే) క్యాంప్‌నకు తరలించారు. ఈ ఉదయం ఎంపీడీవో కార్యాలయానికి వైసీపీకి చెందిన ఐదుగురు సభ్యులతోనే ఎమ్మెల్యే రావడం.. అందులో పద్మావతి లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత వైసీపీకి చెందిన మరో ఇద్దరు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు టీడీపీ తరఫున బీసీ సామాజికవర్గం నుంచి గెలుపొందిన షేక్‌ జబీన్‌కు కుల ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో ఆ పార్టీ నుంచి ఎవరూ ఎంపీపీ పదవికి నామినేషన్‌ వేయలేదు. దీంతో వైసీపీ అభ్యర్థి రూపవాణి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు.