AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం

Ap Special Status : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరా? అంటే అవుననే సమాధానం వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, అలాగే అనేక మినహాయింపులు ఇచ్చామని, కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని లోక్ సభ వేదికగా కేంద్రం తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు టే ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వడం లేదని, ఏపీకి సైతం హోదా వీలుకాదని కేంద్రం తేల్చింది.

రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు.

పునర్విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు అమల్లో ఉన్నాయని, పలు విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని రాయ్ తెలిపారు. విద్యాసంస్థల నిర్మాణాలు, ప్రాజెక్టుల పూర్తికి చాలా సమయం పడుతుందని అన్నారు. పునర్విభజన చట్టం అమలులో తలెత్తే సమస్యలను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి వెల్లడైంది.

ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలి: మిథున్ రెడ్డి
కాగా, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ స్పష్టం చేశారు.