Yarlagadda Lakshmi Prasad : ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వైసీపీలోనూ దుమారం.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. వైపీపీలోనూ దుమారం రేగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.

Yarlagadda Lakshmi Prasad : ఎన్టీఆర్ పేరు తొలగింపుపై వైసీపీలోనూ దుమారం.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

Yarlagadda Lakshmi Prasad : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రచ్చ రచ్చ జరుగుతోంది. అటు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగగా.. ఇటు అధికార పార్టీ వైపీపీలోనూ దుమారం రేగింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే పేరు మార్పు బిల్లుని వెనక్కి తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దేనికైనా వైఎస్ఆర్ పేరు పెడితే తనకు అభ్యంతరం లేదని… కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించడం సరికాదని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

తెలుగుగంగ ప్రాజెక్టుకు ‘ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు’గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నామకరణం చేశారని యార్లగడ్డ గుర్తుచేశారు. అందుకే తనకు వైఎస్సార్ అంటే అంత గౌరవమని అన్నారు. చంద్రబాబుపై తనకు కోపం ఉండటానికి కారణం ఏమిటంటే… టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన వెళ్తున్నారని అన్నారు. వైస్రాయ్ హోటల్ ఘటన తర్వాత టీడీపీని నడిపించే శక్తి చంద్రబాబుకే ఉందని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెపుతున్నానని తెలిపారు.

అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని.. అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకురాలేదని.. కానీ, చంద్రబాబు తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్ పేయి సిద్ధంగా ఉంటే… చంద్రబాబు వద్దన్నారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న వస్తే క్రెడిట్ లక్ష్మీపార్వతికి వస్తుందని చంద్రబాబు భావించారని చెప్పారు.

మొత్తంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇదే అంశంపై టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రచ్చ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయంపై సొంత పార్టీలో సైతం కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.