ఏపీలో పంచాయతీ ఎన్నికలు..ఓట్లు వేయొద్దంటు..ఒడిషా ప్రభుత్వం బెదిరింపులు

ఏపీలో పంచాయతీ ఎన్నికలు..ఓట్లు వేయొద్దంటు..ఒడిషా ప్రభుత్వం బెదిరింపులు

odisha govt threatening Ap voters : ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు కాక కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయవద్దు అని ఏపీ పక్క రాష్ట్రమైన ఒడిశా ప్రభుత్వం ప్రజల్ని బెదిరిస్తోంది. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. అదేంటీ? ఏపీలో ఎన్నికలు జరుగుతుంటే అది ఒడిషాకు ఏంటీ సంబంధం? ఓట్లు వేయవద్దని చెప్పటమేంటీ? అనే అనుమానం రావచ్చు..అసలు విషయం ఏంటంటే..

కొటియా పల్లెల్లో గిరిజనులు..
అది ఉత్తరాంధ్ర జిల్లా అయిన విజయనగరంలోని సాలూరు మండలం. ఈ మండలంలో పట్టుచెన్నేరు, పగులుచెన్నేరు, కురుకూటి, గంజాయిభద్ర, సారిక పంచాయతీల్లో 23 గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొటియా పల్లెలు అని పిలుస్తారు. ఇక్కడి ప్రజల పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి. కానీ ఉమ్మడి ఏపీ (ఏపీ తెలంగాణ విడిపోకముందు) ప్రభుత్వం గిరి శిఖర గ్రామాల జీవన స్థితిగతుల్ని పరిశీలించింది.

ఏపీకి చెందిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ..ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించి..పలు సంక్షేమ ఫలాలు అందించారు. ఈక్రమంలో ఒడిశా ప్రభుత్వం కూడా మీకోసం మేమున్నాం అంటు వచ్చింది. మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం..అభివృద్ధి చేస్తాం అంటూ వచ్చింది. అక్కడి గిరిజనులకు చేరువయ్యేందుకు పలు ప్రయత్నాలు ప్రారంచి..దాదాపు రూ.180 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టింది.

ఈ గ్రామాల ప్రజలపై ఎందుకంత ప్రేమ ఒడిశా ప్రభుత్వానికి?!
కొటియా పల్లెలుగా పిలిచే ఈ గ్రామాల్లో ఖనిజ సంపదలకు నిలయాలుగా ఉన్నాయి. కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన నిక్షేపాలున్నాయి. వీటి విలువ లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకోవాలని ఒడిశా భావించింది. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన వివాదాన్ని పార్లమెంటు కమిటీ దృష్టికి తీసుకెళ్లటంతో దానిపై పార్లమెంటు కమిటీ అధ్యయనం చేస్తోంది.

దీంట్లో భాగంగా ఎక్కువ శాతం ప్రజలు ఇష్టం మేరకు వారిని ఏ రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అక్కడి గ్రామాల సంక్షేమ, అభివృద్ధి పథకాలపై దృష్టి పెట్టటంతో అక్కడి గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. అప్పటి నుంచి పలు సంక్షేమ పథకాలు ఆ గ్రామాలవారికి అందుతున్నాయి. దీంతో వారు ఏపీపైనే అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఏపీలో ఎన్నికలతో రాజుకుంటున్న వివాదంతో మరోసారి తెరపైకి కొటియా గ్రామాలు
విజయనగరం జిల్లాలోని కొటియా గ్రూప్‌లోని గంజాయిభద్రలో 13 గ్రామాలున్నాయి. ఈక్రమంలో ఏపిలో పంచాయతీ ఎన్నికలు విడతలవారీగా కొనసాగుతున్న క్రమంలో పట్టుచెన్నేరులో నాలుగు, పగులుచెన్నేరులోని మూడు, సారికలో ఒకటి, కురుకూటిలో రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. ఈక్రమంలో ఒడిశా సర్కారు కొటియా గ్రూప్ ఈ గ్రామాల్లో పోలీసుల్ని రంగంలోకి దించింది. ఏపీ ఎన్నికలకు వెళ్లొద్దని బెదిరిస్తోంది. ఓట్లు వేయొద్దని ఓటర్లను బెదిరిస్తోంది.