టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు

టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు

Old age homes will be set up under the auspices of TTD : తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని  చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ లెప్రసీ ఆసుపత్రి,  వృద్ధాశ్రమాన్ని ఆదివారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. వృద్ధాశ్రమంలో 32 మంది, లెప్రసి హోం లో 56 మంది ఉన్నారని  అధికారులు వివరించారు.

సుబ్బారెడ్డి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, భోజనం, ఇతర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుండటం చూసి దాన్ని వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం లెప్రసీ వ్యాధిగ్రస్థుల కోసం ఉపయోగిస్తున్న బ్లాక్ ను మరమ్మత్తులు చేయించి, రంగులు వేయించాలని చెప్పారు. మిగిలిన భవనాలను కూడా అభివృద్ధి చేసి వృద్ధాశ్రమానికి వాడుకోవాలన్నారు.

ఆర్థిక పరిస్థితే ప్రాతిపదికన అర్హులైన వృద్ధులను చేర్చుకోవడానికి అవసరమైతే నిబంధనలు సవరిస్తామని చైర్మన్ అధికారులకు చెప్పారు. ఖాళీగా ఉన్న భవనాలు ఉపయోగంలోకి తేవాలన్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల వద్ద సిబ్బందిని రెండు షిఫ్ట్ లుగా విధులకు నియమించాలన్నారు.

అవసరమైతే తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించు కోవడానికి ప్రతిపాదనలు పంపితే అనుమతి మంజూరు చేస్తామన్నారు. అన్నమయ్య మార్గం లో కూడా భక్తులు ఎక్కువగా నడచి వచ్చే రోజుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.