బ్యాంకు రుణాలిప్పిస్తామని మోసం చేసిన పాత నేరస్థులు

బ్యాంకు రుణాలిప్పిస్తామని మోసం చేసిన పాత నేరస్థులు

కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు.  ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన మల్లిడి తాతారెడ్డి(33) లు ప్రభుత్వం పధకాల కింద రుణాలు ఇప్పిస్తామని చెప్పి ప్రముఖులను మోసం చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించి జూన్ 27, శనివారం విడుదలయ్యారు.

అదే రోజు సాయంత్రం అనంతపురానికి చెందిన ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్సీకి ఫోన్ చేసి తాము ఇండ్రస్ట్రీస్ డిప్యూటీ సెక్రటరీనని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ చేసి రూ.50 లక్షలు రుణం మంజూరు చేయిస్తామని…మార్జిన్ మనీగా రూ.1.25 లక్షలు జమ చేస్తే వెంటనే లోన్ వస్తుందని చెప్పాడు.  అది నమ్మిన ఎమ్మెల్సీ ఈ సమాచారాన్ని తన అనుచరులకు చెప్పాడు. దీంతో జిల్లాలోని హిందూపురం, చిలమత్తూరు కు చెందిన ఎమ్మెల్సీ అనుచరులు ఏడుగురు ఆ వ్యక్తి చెప్పిన ఖాతాకు మొత్తం రూ.8.25 లక్షలు జమ చేశారు.

డబ్బులు జమ చేసినా  ఎంత సేపటికీ బ్యాంకు నుంచి లోన్ శాంక్షన్ అయినట్లు ఫోన్ రాకపోవటంతో ఎంక్వైరీ చేశారు. బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన సమాధానంతో మోసపోయినట్లు గ్రహించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు జమ చేసిన ఖాతాలు మల్లిడి తాతారెడ్డిదిగా గుర్తించారు.  వెంటనే పోలీసులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని అనంతపురం డీఎస్పీతెలిపారు.

Read:నెల్లూరు టూరిజం ఆఫీసులో వికలాంగ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి