ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!

  • Published By: vamsi ,Published On : December 7, 2020 / 06:52 AM IST
ఏలూరులో వ్యాధి వాటర్ వల్ల కాదు.. ఏం వైద్యం చేయాలో తెలియట్లేదు!

Eluru:పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందల మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోండగా.. పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవడంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్న ఆయన.. సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.



ఏలూరులోని దక్షిణ వీధి, తూర్పు వీధి, పడమర వీధి, అశోక్ నగర్, అరుంధతి పేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆకస్మికంగా కళ్లు తిరిగి పడిపోవడం, నురగలు కక్కుతూ పడిపోవడం, వాంతులు, తలపోటు తదితర లక్షణాలతో మూడు రోజులుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని రాష్ట్రప్రభుత్వం చెప్పినప్పటికీ, ఓ వ్యక్తి చనిపోవడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.



అయితే నీరు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ మొదట వార్తలు రాగా.. లేటెస్ట్‌గా నీరు కలుషితం కాలేదంటూ రిపోర్ట్ వచ్చింది. నీటి శాంపిళ్లను టెస్ట్ చేయించిన అనంతరం నీరు కలుషితం కాలేదంటూ రిపోర్ట్ వచ్చింది. రోగుల నురగ, బ్లడ్ శాంపిళ్లను పరిక్షిస్తోన్న నిపుణులు కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.



ఇప్పటికే 293మంది ఈ వ్యాధి కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా.. 123మందిని డిశ్చార్చి చేశారు డాక్టర్లు. సగం మందికి పైగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అంతుచిక్కని వ్యాధి గురించి ఎటువంటి నిర్ధారణ రాకపోవడంతో ఎలా వైద్యం చేయాలో తెలియక డాక్టర్లు తికమకపడుతున్నారు. రోగం తెలియకుండా వైద్యం చెయ్యడం కష్టంగా భావిస్తున్నారు.



ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ(07 డిసెంబర్ 2020) ఏలూరులో పర్యటించనున్నారు. ప్రజలు పిట్టల్లా రాలడానికి కారణం ఏంటనేది మూడు రోజులైనా ఇంత వరకు అంతు చిక్కలేదు.