ప్రాణం తీసిన ఆన్ లైన్ క్లాసులు, ఫోన్ కొనివ్వలేదని 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

  • Edited By: naveen , October 26, 2020 / 01:09 PM IST
ప్రాణం తీసిన ఆన్ లైన్ క్లాసులు, ఫోన్ కొనివ్వలేదని 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

online class: ఆన్ లైన్ క్లాసులు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలపూర్ లో చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. దీంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కరోనావైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ పాఠాలపై ఫోకస్ పెట్టాయి. ఆన్ లైన్ క్లాస్ అంటే స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ మస్ట్. ఈ వ్యవహారం పేద, మధ్య తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. అసలే కరోనా లాక్ డౌన్ కారణంగా అందరి ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయాయి. తినడానికే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వడం తల్లిదండ్రులకు ప్రహసనంగా మారింది. తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకోలేని కొందరు పిల్లలు, తమకు ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కొందరు తల్లిదండ్రులు కాయ కష్టం చేసి, కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చేంత ఆర్థిక స్థోమత లేదు. ఇవేవీ అర్థం చేసుకోని కొందరు పిల్లలు, ఆన్ లైన్ క్లాసుల కోసం తమకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. అంత ఆర్థిక స్థోమత తమకు లేదని, ఇప్పుడు ఫోన్ వద్దని కొందరు తల్లిదండ్రులు పిల్లలకు నచ్చ చెబుతున్నారు. దీంతో కొందరు పిల్లలు మనస్తాపం చెందుతున్నారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుంటున్నారు.

మరోవైపు ఆన్ లైన్ లో చెప్పే పాఠాలు అర్థం కాక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. క్లాసులకు సరిగా అటెండ్ అవ్వకపోతే తక్కువ మార్కులు వస్తాయని, ఫెయిల్ అవుతారని టీచర్లు తెస్తున్న ఒత్తిడి విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇది కూడా ఆత్మహత్యలకు దారి తీస్తోంది. మొత్తంగా ఆన్ లైన్ క్లాసులు కొందరు తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నాయి.