తెరిచే ఉంచుతారు : గ్రహణం పట్టని ఏకైక ఆలయం ఇదే

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 01:56 AM IST
తెరిచే ఉంచుతారు : గ్రహణం పట్టని ఏకైక ఆలయం ఇదే

నేడు(డిసెంబర్ 26,2019) సూర్యగ్రహణం. దీంతో దేశవ్యాప్తంగా బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే ఆలయాలను మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణలు, అభిషేకాలు, శుద్ధి చేశాకే ఆలయాలు తిరిగి తెరుస్తారు. దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ.. ఏపీలోని ఒక ఆలయాన్ని మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంచుతారు. గ్రహణం పట్టని ఏకైక ఆలయంగా దీన్ని చెబుతారు. అదే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం. 

సూర్య గ్రహణ సమయంలోనూ ఈ ఆలయంలోని శ్రీకాళహస్తీశ్వరుడికి అభిషేకాలు చేస్తారు. సూర్యచంద్రులు, అగ్నిభట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, నవగ్రహాలు ఉన్న కవచంతో వాయులింగేశ్వర స్వామి దర్శనమిస్తుంటారు. ఈ కవచంలోని సౌరశక్తి వల్ల రాహు, కేతువులు ఆలయంలోకి ప్రశేశించవు అని చెబుతారు. అందుకే గ్రహణం పట్టని ఆలయంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధి పొందింది.

నేడు దేశవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఉదయం 8గంటల 11 నిమిషాల నుంచి 11గంటల 20 నిమిషాల వరకు సూర్యగ్రహణం ఉండనుంది. సుమారు 3 గంటలకు పైగా గ్రహణం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూసివేశారు.

ఈ సూర్యగ్రహణం గురువారం(డిసెంబర్ 26,2019) దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచించారు. 99శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక శాతం వెలుగునైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకన్ల పాటు చూసినా ప్రమాదమే అన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ సూర్యగ్రహణం చాలా ప్రమాదం అని చెప్పారు.

కాగా, ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూడరాదని, ముఖ్యంగా మూల నక్షత్రం వారు ఈ గ్రహణం చూస్తే అనారోగ్య హేతువని జ్యోతిషులు చెబుతున్నారు. భారత్‌తో పాటు సౌదీ ఆరేబియా, ఖతార్‌, యూఏఈ తదితర దేశాల్లో కూడా సూర్య గ్రహణం కనిపించనుంది. హైదరాబాద్‌లో గురువారం 9 నుంచి 12.30 గంటల వరకు సూర్యగ్రహణం కనిపిస్తుందని బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ వెల్లడించారు. 10.45 గంటల సమయంలో 50 నుంచి 60 శాతం సూర్యుడు కనిపిస్తాడని స్పష్టం చేశారు. ఇక ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్‌లలో కూడా ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది.

* గ్రహణం పట్టని ఏకైక ఆలయం శ్రీకాళహస్తి ఆలయం
* గ్రహణకాల సమయంలోనూ తెరిచే ఉండనున్న కాళహస్తి ఆలయం
* సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు
* ఉ.5 గంటల నుంచి మూడు కాలాల అభిషేకాలు నిర్వహణ
* ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్న ఆలయ అర్చకులు

Also Read : ఈ స్తోత్రం చదువుకుంటే గ్రహణ దోషం ఉండదు

Also Read : ఈ రాశుల వారిపై గ్రహణ ప్రభావం ఉండదు

Also Read : సూర్య గ్రహణం: తీసుకోవలసిన జాగ్రత్తలు.. ముఖ్యంగా గర్భవతులు