టీడీపీని ఓడించింది మేమే, నెక్ట్స్ టార్గెట్ వైసీపీ.. బీజేపీ నేతల వ్యాఖ్యల అంతరార్థం ఏంటి?

10TV Telugu News

ap bjp warns ysrcp: మింగ మెతుకు లేదు గానీ.. మీసానికి సంపెంగ నూనె అన్నట్టుంది ఏపీ బీజేపీ యవ్వారం. అసెంబ్లీకి గానీ, పార్లమెంటుకు గానీ రాష్ట్రం నుంచి ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది ఆ పార్టీ. అంతేనా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కానీ, మాటలు మాత్రం కోటలు దాటించేస్తోంది. పార్టీని ఎక్కడికో తీసుకెళ్లిపోతాం.. నెక్స్ట్‌ ప్రభుత్వం మాదేనన్నంతగా బిల్డప్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు.

కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. విషయం ఏదైనా.. ఆయన యమ స్పీడుగా మాట్లాడేస్తున్నారు. అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీని కూడా మాటలతో ఉతికేస్తున్నారు. కాకపోతే కొన్ని మాటలు మరీ ఓవర్‌గా అనిపిస్తుండడంతో పార్టీ నాయకులే విస్తుపోతున్నారట.

కన్నా కంటే స్పీడని చూపించుకొనే ప్రయత్నాలు:
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ.. ఏపీపై మరింత ఫోకస్‌ చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజుని నియమించిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కన్నా కంటే తాను స్పీడని చూపించుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు.

చిన్న విషయం దొరికితే చాలు.. వదిలిపెట్టకుండా పోరాడడం మొదలుపెట్టింది ఆ పార్టీ. జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై బీజేపీ నేతలపై కేసులు బనాయించడం, ఆ పార్టీ కార్యకర్తల అరెస్ట్ తర్వాత వీర్రాజు తన మనసులో మాట బయటపెట్టారు.

తమ వల్ల టీడీపీ ఓడిపోయినట్టే వైసీపీకి కూడా అదే గతి తప్పదని వార్నింగ్:
రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే సీటూ గెలవలేకపోయిన బీజేపీ.. ప్రస్తుత ప్రభుత్వాన్ని భయపెట్టేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. తమ వల్ల టీడీపీ ఓడిపోయినట్టే వైసీపీకి కూడా అదే గతి తప్పదని, తమ వ్యూహరచన చాలా స్ట్రాంగ్‌ అని ఈ మధ్య వ్యాఖ్యానించారు వీర్రాజు. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలసి పని చేసిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక మంత్రి, ఎమ్మెల్సీ పదవులను పంచుకుంది. కొన్నాళ్ల సావాసం తర్వాత ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం చెడింది. ఇరు పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఢీకొన్నాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయేలా చేసింది మేమే:
అప్పటి టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పించినా రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా ఉపయోగం లేకపోయింది. అందుకే టీడీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావించిందంట. సైలెంట్‌గా వ్యూహం రచించి టీడీపీని 2019 ఎన్నికల్లో ఓడిపోయేలా చేసిందని వీర్రాజు ప్రకటించారు. దీనిపై సొంత పార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారట. అంత ప్లానింగే ఉన్నప్పుడు ఓ పార్టీని ఓడించడానికి బదులు తామే గెలవడానికి ప్లాన్‌ వేసుకోవచ్చు కదా అనే సెటైర్లు వేస్తున్నారు.

బీజేపీకి అంత సత్తా ఉంటే కనీసం డిపాజిట్లు ఎందుకు దక్కించుకోలేకపోయింది:
బీజేపీకి అంత సత్తా ఉంటే కనీసం డిపాజిట్లు సైతం ఎందుకు దక్కించుకోలేకపోయిందని ప్రత్యర్థి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించినా, బీజేపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించినా, టీడీపీ మీద అనుసరించిన వ్యూహాన్నే వైసీపీ మీద ప్రయోగించాల్సి వస్తుందని వీర్రాజు హెచ్చరిస్తున్నారట. సోమూ వీర్రాజు వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలే లోలోపల తెగ నవ్వేసుకుంటున్నారట. మరో నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమతో పెట్టుకున్న చంద్రబాబు ఏమయ్యారో కొడాలి నాని తెలుసుకోవాలని అంటున్నారు.

చంద్రబాబుకు పట్టిన గతే వైసీపీ సర్కారుకు పడుతుందని హెచ్చరిక:
నానిని మంత్రి పదవి నుంచి తప్పించే వరకూ బీజేపీ ఊరుకోదని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి కావని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశాన్నే ఆయన చెప్పారనే అభిప్రాయంలో బీజేపీ ఉంది. చంద్రబాబుకు పట్టిన గతే వైసీపీ సర్కారుకు పడుతుందని బీజేపీ నేతలు చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ ఓటమికి అంత స్కెచ్‌ వేసే బదులు కనీసం ఒక్క సీటు అయినా గెలుచుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదని సెటైర్లు వేస్తున్నారు. లేనిపోని గొప్పలు మానేసి.. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆ పార్టీ నేతలే లోలోపల మాట్లాడేసుకుంటున్నారట.10TV Telugu News