వ్యాక్సిన్ వేస్ట్ చెయ్యొద్దు.. సీఎంలకు క్లాస్ పీకిన మోడీ.. తెలుగు రాష్ట్రాలే టాప్..

వ్యాక్సిన్ వేస్ట్ చెయ్యొద్దు.. సీఎంలకు క్లాస్ పీకిన మోడీ.. తెలుగు రాష్ట్రాలే టాప్..

Over 10 Covid Vaccine Wastage In Up Telangana Andhrapradesh

కోవిడ్ వ్యాక్సిన్.. భారత్‌లో జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవ్వగా.. టీకా వేయించుకునేందుకు లక్షల మంది ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీకా వృథా జరిగిపోతూనే ఉంది. వ్యాక్సిన్‌ను వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉండడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలవరపరుస్తోంది. కోవిడ్‌ కట్టడిపై దృష్టి సారించిన ప్రధాని మోడీ.. టీకా వృథా కావడంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు క్లాస్‌ పీకారు.

ప్రాణాంతక వైరస్‌ భారినుంచి రక్షించే టీకాను సంజీవనిగా భావిస్తున్న భారత్ …వ్యాక్సిన్ మైత్రీ పేరుతో 72 దేశాలకు సరఫరా చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూనే ఉంది. ఎన్నో దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తూ ఉండగా.. ప్రాణాల్ని నిలబెట్టే ఈ టీకాలను వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కానీ వ్యాక్సిన్‌ వృథా అవుతున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు ప్లేస్‌లలో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ముఖ్యమంత్రులతో వర్చువల్‌ కాన్ఫరెన్స్ సందర్భంగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10 శాతం కన్నా ఎక్కువగా వ్యాక్సిన్‌ వృథా అవుతోందంటూ ప్రస్తావించిన మోడీ, వ్యాక్సినేషన్‌ను స్పీడన్‌ చేయాలని సీఎంలకు సూచించారు. కరోనాపై పోరుతో వచ్చిన ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసంగా మారకుండా చూసుకోవాలని చురకలేశారు. టీకా వృథా తగదని హెచ్చరించారు. వ్యాక్సిన్‌ వృథా ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది.

తెలంగాణలో 17.6 శాతం వ్యాక్సిన్‌ వృథా జరిగితే, ఏపీలో 11.6 శాతం డోసేజ్ వేస్ట్‌ అయ్యింది. జాతీయస్థాయిలో టీకా వృథా 6.5 శాతంగా ఉంటే.. ఏపీ,తెలంగాణలో మాత్రం రెండు,మూడింతలు ఎక్కువగా ఉండడం కలవరపరుస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, కర్నాటక, జమ్ముకశ్మీర్‌లోనూ టీకా వృథా జాతీయసగటు కంటే ఎక్కువగా ఉంది. తెలంగాణలో వెయ్యి డోసుల్లో 176, ఏపీలో వెయ్యి డోసుల్లో 116 వృథా అయ్యాయంటే ఎన్నో కారణాలున్నాయి.

కోవాగ్జిన్ వృథాను సున్నా శాతానికి పరిమితం చేయాలంటే పక్కా వ్యూహం ఉండాలి. కోవాగ్జిన్ వయల్‌ను ఒకసారి తెరిస్తే 20 మందికి టీకా ఇవ్వొచ్చు. కానీ వయల్‌ తెరిచే సమయంలో 10 మందే ఉంటే.. సగం వృథా అయినట్లే. అందుకే సరిపడా ఉన్నప్పుడే కోవాగ్జిన్ వయల్‌తెరవాలి. చివర్లో ఒకరిద్దరు ఉంటే మర్నాడు రమ్మని పంపాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా జాగ్రత్తలు తీసుకోకపోయేసరికి టీకావృథా అయ్యింది. తెలంగాణ, ఏపీ తర్వాత స్థానాల్లో టీకాను ఎక్కువగా వృథా చేసే రాష్ట్రాల్లో యూపీ, కర్నాటక, జమ్ముకశ్మీర్‌ఉన్నాయి. యూపీలో 9.4 శాతం, కర్నాటకలో 6.9 శాతం, జమ్ముకశ్మీర్‌లో 6.9 శాతం కోవిడ్ వ్యాక్సిన్‌ వృథా అయ్యింది.