ఏపీలో పంచాయతీ, నామినేషన్ల పర్వం

ఏపీలో పంచాయతీ, నామినేషన్ల పర్వం

Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటించనున్నారు. అనంతరం వారికి గుర్తులు కూడా కేటాయిస్తారు. తొలి విడతలో 3 వేల 249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ పదవులకు 18 వేల 168, ఆయా గ్రామాల్లో వార్డు పదవులకు 77 వేల 554 నామినేషన్లు ఆమోదం పొందాయి.

నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నచోట ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నచోట అభ్యర్థులకు క్రమపద్ధతిలో ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. మరోవైపు రెండో విడతలో 3 వేల 327 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులతో పాటు 33 వేల 562 వార్డు పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటలతో రెండో విడత నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. గ్రామాల్లో దాఖలయ్యే నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడానికి వీలుగా పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌ రూపొందించింది. తొలివిడతకు ఈనెల 9న, రెండో విడతకు ఈనెల 13న పోలింగ్‌ జరుగనుంది.