ఏపీలో పంచాయతీ పోరు : ఎవరిది పై చేయి

ఏపీలో పంచాయతీ పోరు : ఎవరిది పై చేయి

Panchayat Election Andhrapradesh : ఏపీలో పంచాయతీ ఎన్నికల పర్వం హీటెక్కుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఎస్‌ఈసీ అంటుంటే.. అసలు ఎన్నికలు ఇప్పట్లో వద్దనే వాదన వినిపిస్తోంది సర్కార్. ఎన్నికల నిర్వహణపై ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానిక సమరమే నెలకొంటోంది ఏపీలో. మరి ఈ పోరులో ఎవరిది పైచేయి..?

పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు :-
ఇప్పుడే ఎలక్షన్లు వద్దంటున్న ప్రభుత్వం వాదనను ఏమాత్రం పట్టించుకోకుకుండా.. ఎస్‌ఈసీ ముందుకెళ్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 25కల్లా తాజా ఓటర్ల జాబితా సమర్పించాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలోగా ఎన్నికల నిధులు విడుదల చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది ఎస్‌ఈసీ. తమ ఆదేశాల ప్రకారం కలెక్టర్లు ఎన్నికలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. గత ఏడాది మార్చి 7న తయారు చేసిన ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుంది ఎస్‌ఈసీ.

ఎస్ఈసీ సన్నాహాలు :-
మరోవైపు 2021, జనవరి 23వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని మరోసారి తేల్చిచెప్పింది ప్రభుత్వం. ఎస్‌ఈసీ తన నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. ఎస్‌ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు సీఎస్‌. పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఎస్‌ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలు నిర్వహించొద్దని ఎస్‌ఈసీని కోరారు సీఎస్‌. అప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దన్నారు.

అధికారుల తొలగింపు :-
తొమ్మిది మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై సీఎస్‌ స్పందించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్‌ గుప్త, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌ రెడ్డి సహా తొమ్మిది మంది కరోనా విధుల్లో ఉన్నందున వారిని తొలగించడం సాధ్యం కాదన్నారు. అటు పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిశారు. సుప్రీం కోర్ట్‌ తీర్పు వెలువడే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం :-
ఇప్పటికే ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం. కానీ కోర్టు సమయం ముగియడంతో అత్యవసర విచారణకు సమయం దొరకలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనుంది. కనీసం ఫ్రంట్ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇచ్చేవరకైనా ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్ట్‌ను కోరనుంది. అటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో చర్చించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్. అనంతరం అధికారులతో భేటీ అయి ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓ వైపు ఎన్నికల నిర్వహణను ఆపాలని వైసీపీ ప్రభుత్వం.. మరోవైపు ఎలాగైనా నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టుదలతో వ్యవహరిస్తుండటంతో ఏపీలో ఉత్కంఠ నెలకొంది.