ఏపీలో ‘లోకల్’‌ వార్‌..ఎస్‌ఈసీ వర్సెస్ సర్కార్‌

ఏపీలో ‘లోకల్’‌ వార్‌..ఎస్‌ఈసీ వర్సెస్ సర్కార్‌

Panchayat Election War in AP : ఏపీలో లోకల్‌ వార్‌ ముదురుతోంది. ఎన్నికలపై ఎస్‌ఈసీ దూకుడు పెంచుతుండగా.. సర్కార్‌ నిమ్మగడ్డను టార్గెట్‌ చేస్తోంది. మరోవైపు పాలకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ ఆరోపించగా.. టీడీపీ మ్యానిఫెస్టో రిలీజ్‌ చేయడంపై అధికార వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టీడీపీపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది.

ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిబంధనలకు అనుగుణంగా తాను పని చేస్తున్నానని.. కొందరు నేతలు కావాలని తమను తప్పుపట్టడం సరికాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ అన్నారు. ఇదే సమయంలో ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎస్‌ఈసీ నడుచుకుంటున్నారని ఆరోపించారు.

మరోవైపు ఏపీలో జరిగే ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరగడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పల్లె ప్రగతి- పంచ సూత్రాల పేరిట మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. వైసీపీ దౌర్జన్యాలతో 2 వేల 274 ఏకగ్రీవాలు చేసిందని ఆరోపించారు. ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నారు.

మరోవైపు పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను బీజేపీ, జనసేన కోరాయి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టేలా చూడాలని విన్నవించినట్లు నేతలు చెప్పారు. నామినేషన్ల విధానాన్ని ఆన్‌లైన్‌లో చేయాలని కోరారు. మొత్తంగా ఏపీలో నామినేషన్లకు ముందే పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయో చూడాలి.