ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశ పోలింగ్

ఏపీలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశ పోలింగ్

Panchayat elections in AP : ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు చేరుకుంటున్నారు. 6.30 గంటల నుంచి ఓటింగ్‌కు అనుమతి ఇస్తారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది. మిగతా గ్రామాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతి ఇస్తారు. పోలింగ్‌ ముగిశాక..సాయంత్రం 4 గంటలకే ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ వెంటనే ఫలితాలు వెల్లడికానున్నాయి. మూడవ దశలో 3 వేల 221 గ్రామపంచాయతీలకు నోటిఫికేషన్ ఇస్తే.. 579 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో పంచాయతీలో సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మొత్తంగా బుధవారం 2,639 పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో 7 వేల 757 మంది సర్పంచ్‌ అభ్యర్థులు తమ దృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడో విడతలో 31 వేల 516 వార్డులకు… 11 వేల 753 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 210 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 19,553 వార్డుల్లో ఓటింగ్‌ జరగనుంది. వార్డు మెంబర్‌ స్థానాల బరిలో 43,162 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మొత్తం 13 జిల్లాలు, 20 రెవిన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని మూడో విడత పల్లె పోరు జరగనుంది. మొత్తం 26 వేల 851 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరగనుంది. ఇవాళ సుమారు 55 లక్షల 75 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. పోలింగ్ బూత్‌ల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటుచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్‌ కొనసాగనుంది. 4 వేల 118 సమస్యాత్మక, 3 వేల 127 అత్యంత సమస్యాత్మక, 19 వందల 977 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు భద్రత కల్పించారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల తీరుపై పర్యవేక్షణ చేయనున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి నిఘా ఉంటుంది. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ పేషంట్‌లు పోలింగ్ చివరి గంటలో వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.