మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా.. నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పంచ్ పదవికి నో నామినేషన్

మూడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా.. నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పంచ్ పదవికి నో నామినేషన్

Panchayat elections postponed in three villages : ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. విజయనగరం మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి విజేతలకు డిక్లరేషన్లు అందజేస్తారు. వీలైతే ఇవాళే ఉప సర్పంచ్‌ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశముంది. లేకపోతే రేపు ఉప సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల వరకే ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక గ్రామాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొదటి విడతలో 2వేల 723 సర్పంచ్‌ స్థానాలకు, 20వేల 157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ అభ్యర్థులుగా 7వేల 506 మంది, వార్డులకు 43వేల 601 మంది పోటీపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను తీసుకొచ్చారు.

తొలిదశలో 3వేల 249 గ్రామ పంచాయతీల్లోని 525 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పంచ్‌ పదవికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకపోవడంతో.. ఆ గ్రామంలో సర్పంచ్‌ ఎన్నిక వాయిదా పడింది. 2వేల 723 సర్పంచ్‌ స్థానాలకు 7వేల 506 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే, 32వేల 502 వార్డు సభ్యులకు గాను 12వేల 815 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

160 వార్డు స్థానాలకు అసలు నామినేషన్లే వేయలేదని అధికారులు తెలిపారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం వల్ల తూర్పుగోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డెగూడెం గ్రామాల్లో కొన్ని వార్డులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని రెండు వార్డులకు ఎన్నికల గుర్తుల కేటాయింపులో తేడాలు జరగడంతో ఆ వార్డు సభ్యుల ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఈ ఎన్నికల్లో 3వేల 458 సమస్యాత్మక, 3వేల 594 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయ్‌. స్టేజ్‌-1 రిటర్నింగ్‌ అధికారులుగా వెయ్యి 130 మంది, స్టేజ్‌-2 రిటర్నింగ్‌ అధికారులుగా 3వేల 249, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వెయ్యి 432, ప్రిసైడింగ్‌ అధికారులుగా 33వేల 533, ఇతర పోలింగ్‌ సిబ్బందిగా 44వేల 392 మంది అధికారులు పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు.

పోలింగ్‌ సరళిని పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లుగా 3వేల 47 మం దిని నియమించింది ఈసీ. కొవిడ్‌ నిబంధనల ప్రకారం మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లోవ్స్‌ స్టేషన్ల వారీగా పంపిణీ చేశారు అధికారులు. పాజిటివ్‌ వచ్చిన వారికి పోలింగ్‌ చివరి గంటలో ఓటు వేసుకునే అవకాశం కల్పించారు.