ఏపీ పంచాయతీ ఎన్నికలు : కోళ్ల పెంట కింద మందుబాటిళ్లు

ఏపీ పంచాయతీ ఎన్నికలు : కోళ్ల పెంట కింద మందుబాటిళ్లు

Telangana liquor in AP : ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం ఏరులై ప్రవహిస్తోంది. దీంతో మద్యం అక్రమ రవాణాపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోతో పాటు పోలీసులు కూడా గట్టిగా నిఘా పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా లింగాలపాలెం చెక్‌పోస్ట్‌ వద్ద తెలంగాణ నుంచి ఏపీలోకి వస్తున్న మద్యం బాటిళ్లను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోళ్ల పెంట రవాణా చేసే వాహనంలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కోళ్ల పెంటగా నమ్మిస్తూ వేలాది బాటిళ్లను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 9 వేల 600 బాటిళ్ల అక్రమ మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పోలీసులు సీజ్ చేశారు. ఈ మార్గంలో భారీ ఎత్తున అక్రమంగా మద్యం రవాణా అవుతుందన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు కోళ్ల పెంటతో వెళ్తున్న వాహనాన్ని అపారు. తనిఖీ చేయాలని కోరగా.. కోళ్ల పెంట మాత్రమే ఉందని వాహనం డ్రైవర్‌, క్లీనర్‌ నమ్మించారు. చివరికి తనిఖీలు చేయగా.. భారీ ఎత్తున అక్రమ మద్యం దొరికింది. దీన్ని వెంటనే సీజ్‌ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పంపిణీ కోసం దీన్ని తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది.