ఏపీలో పంచాయతీ : ఎన్నికలు జరుగుతాయా ? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది ?

ఏపీలో పంచాయతీ : ఎన్నికలు జరుగుతాయా ? సుప్రీంకోర్టు ఏం చెబుతుంది ?

Panchayat in AP : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? ఇప్పుడిదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై 2021, జనవరి 25వ తేదీ సోమవారం సుప్రీం తీర్పు చెప్పనుండటంతో.. రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు ధర్మాసనం ఏం చెబుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరి పంచాయతీ పోరుకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా..? లేక బ్రేకులేస్తుందా..?  ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా ? లేదా ? అన్న సందిగ్దతతో గ్రామస్థాయి నాయకులకు నిద్ర పట్టడంలేదు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఓ వైపు ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అస్త్ర శస్త్రాలతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి దిగాయి. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికల షెడ్యూల్ ను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వగా, డివిజన్ బెంచ్ మాత్రం ఎన్నిక నిర్వహించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చే కీలక తీర్పు ఫైనల్ కానుంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కార్ : –
హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని, ఎన్నికల నిర్వహణను ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలుపనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా జరుగుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వేస్తోన్న వ్యాక్సిన్‌ను ఆపివేయాలా అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఆరోగ్యశాఖలో పనిచేస్తోన్న వారికి ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తోన్నారు. వచ్చే నెలలో పోలీసులకు వ్యాక్సిన్ వేయనున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోకుండా ఎన్నికల విధులకు హాజరు కాలేమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెబుతున్నాయి.

నిమ్మగడ్డ పట్టుదల : –
ప్రజల ప్రాణాలు కాపాడటం, వారి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలుపనుంది. ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ కు ఏపీ ఎన్జీవో అసోషియేషన్ ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కూడా ఎన్నికలు నిర్వహించవద్దని మరో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. ఈ మూడు పిటీషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గ్రామ పంచాయితీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు కోవిడ్ సంక్షోభంలో నిర్వహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏంటనీ ఉద్యోగ సంఘాల న్యాయవాదులు SECని ప్రశ్నించనున్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు కరోనా వైరస్ వల్ల ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీయనున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించాలన్న నిమ్మగడ్డ పట్టుదలలో రాజకీయ కోణం కూడా వుందని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలుపనున్నారు.

సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ?  : –
సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ స్పెషల్ లీవ్ పిటీషన్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూడా కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం… హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి సహాయ నిరాకరణ చేస్తోందని ఎన్నికల కమీషన్ తరుపు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానానికి తెలుపనున్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునే సమర్థించాలని ధర్మాసనాన్ని కోరనున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా మితిమీరి ప్రవర్థిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయన్న వాదనను ఎస్ఇసి సుప్రీంకోర్టు ముందు చేయనుంది. సోమవారం ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.