ఏపీలో కాక పుట్టిస్తున్న పంచాయతి ఎన్నికలు

ఏపీలో కాక పుట్టిస్తున్న పంచాయతి ఎన్నికలు

Panchayat Political Heat In Andhra Pradesh : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం ముదురుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‍‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం పూర్తి స్థాయిలో విచారించనుంది.

‘సీఎస్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ : –
మరోవైపు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిర్వహణకే ఎన్నికల సంఘం మొగ్గుచూపుతోంది. ఏపీలో ఎన్నికల కోడ్‌పై సీఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల నియామవళిని ఆ లేఖలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని లేఖలో పేర్కొంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో సభలు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాలను ప్రభావితం చేసే పనులు చేపట్టవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలో తెలిపింది. కొత్త పథకాలు, ప్రస్తుత పథకాలకూ ఎన్నికల కోడ్‌ వర్తిస్తుందని ఎస్‌ఈసీ క్లారిటి ఇచ్చింది.

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న బీజేపీ : –
అయితే.. స్థానిక ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ బీజేపీ చెప్పింది. ఎస్ఈసీ నిమ్మగడ్డను బీజేపీ ఏపీ అద్యక్షులు సోము వీర్రాజు కలిసారు. గత ఎన్నికల్లో దౌర్జన్యాలు
జరిగాయని… పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించామన్నారు. ఇప్పుడు కేవలం పంచాయతీలకు నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారని… పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయలేదనే విషయాన్ని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు.

ఆసక్తికర పరిణామాలు : –
ఎవరి వాదన ఎలా ఉన్నా… ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం గంటగంటకీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని శుక్రవారం జగన్ ప్రభుత్వం కోరిన గంటల్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేసి.. పొలిటికల్ హీట్ పెంచేశారు.