పాపం చిన్నారి : నా కూతుర్ని చంపేయండి ప్లీజ్

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 07:48 AM IST
పాపం చిన్నారి : నా కూతుర్ని చంపేయండి ప్లీజ్

mercy killing Madanapalle : నవ మాసాలు మోసి, కని పెంచిన పాప మరణం కోసం కోర్టును వేడుకుంటున్న ఘటన అందరిని కళ్ల నీళ్లు పెట్టిస్తోంది. దిక్కుతోచని స్థితిలో తమ పాపకు మరణం ప్రసాదించాలని కోరుతున్న ఆ తల్లిదండ్రులెవరు..? ఆ పాపకు వచ్చిన కష్టమేంటి. పాప పేరు నాగలక్ష్మి. పుట్టి ఏడేళ్లు అయింది. కానీ ఈ చిన్నారి ఏడాది బిడ్డగానే ఉంది. శారీరక మానసిక లోపంతో బిడ్డలో ఎదుగుదల ఆగిపోయింది. ఒక్కగానొక్క కూతురు ఇలా అనారోగ్యానికి గురికావడంతో ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

తల్లి కడుపులో ఉమ్మనీరు : –
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణానికి చెందిన రామకృష్ణ, గీతాంజలికి ఏడేళ్ల క్రితం మొదటి కాన్పులో పాప పుట్టింది. పాప పుట్టే సమయంలో తల్లి కడుపులో ఉమ్మనీరు తాగడంతో పరిస్థితి విషమించింది. ఆ సమయంలో తిరుపతిలో శస్త్ర చికిత్స చేసి, బిడ్డను కాపాడారు. కానీ అప్పటి నుంచి ఆ బిడ్డ మానసిక ఎదుగుదల సరిగా లేదు. చిన్నారి శారీరక, మానసిక ఎదుగుదల నిలిచిపోవడంతోఎన్నో అవస్థలు పడుతోంది. కన్న బిడ్డ కష్టాన్ని చూడలేని ఆ తల్లిదండ్రులు తెలిసిన ఆసుపత్రుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు.



ఎంతోమంది వైద్యుల్ని కలిశారు. అయినా చిన్నారి ఆరోగ్యం బాగుపడలేదు. నాగలక్ష్మి వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో.. ఏం చేయలేని స్థితిలో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నాగలక్ష్మి బ్రతకాలంటే నెలకు 10 వేల రూపాయల మందులు కావాలని… కానీ తమ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కూలో నాలో చేసి వచ్చిన డబ్బులతో ట్రీట్‌మెంట్‌ చేయించామని.. ఇప్పుడు తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు.

మదనపల్లె కోర్టు : –
చిన్నారిని బ్రతికించుకునేందుకు చేతిలో డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో చిన్నారి తల్లిదండ్రులు మదనపల్లె కోర్టును ఆశ్రయించారు. తమ బిడ్డ నాగలక్ష్మి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తికి వినతిపత్రం అందించారు. చిన్నారి వైద్య ఖర్చులు భరించలేక, పోషణకు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వినతి పత్రంలో పేర్కొన్నారు. జడ్జి ముందు తమ ఆవేదన వెళ్లగక్కారు.



నాగలక్ష్మి తల్లిదండ్రుల ఆవేదనను ఓపిగ్గా విన్న న్యాయమూర్తి వారిని ఓదార్చారు. ఇప్పటివరకు పాప కోసం ఖర్చు చేసిన బిల్లులు తీసుకురావాలని, మరోసారి తనను కలవాలని న్యాయమూర్తి సూచించారు. మరి చిన్నారి నాగలక్ష్మికి న్యాయమూర్తి ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.