Kurnool News: కుమారుడి మృతదేహాన్ని కూడా చూడని తల్లిదండ్రులు

కులాంతర వివాహం చేసుకున్నాడని కుమారుడిని దూరం పెట్టాడు తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేదు.

Kurnool News: కుమారుడి మృతదేహాన్ని కూడా చూడని తల్లిదండ్రులు

Kurnool News

Kurnool News: కులాంతర వివాహం చేసుకున్నాడని కుమారుడిని దూరం పెట్టాడు తండ్రి. చివరకు కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేదు. తండ్రి తరుపు బంధువులు కూడా ఎవరు రాకపోవడంతో స్నేహితులు, తన తోటి డ్రైవర్లు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. శ్రీశైలానికి సమీపంలో ఉన్న సున్నిపెంటలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాలపాటి బసిరెడ్డికి నలుగురు సంతానం. ఇయ్యన రెండవ కుమారుడు రామకృష్ణారెడ్డి 15 ఏళ్ల క్రితం దళిత కులానికి చెందిన బెజవాడ వీరమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో సహించలేని తండ్రి అతడిని దూరం పెట్టాడు. 15 సంవత్సరాలుగా అతడితో మాట్లాడటం లేదు. తండ్రికి దూరంగా ఉంటున్న రామకృష్ణారెడ్డి జీపు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే గత శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా పుచ్చకాయలపల్లి వద్ద జీపు ప్రమాదానికి గురైంది.. దీంతో రామకృష్ణారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని అతడి భార్య వీరమ్మ, కుమార్తెలు మానస, కవితలు.. తన తాత బసిరెడ్డి ఇంటికి తీసుకొచ్చారు. అయితే బసిరెడ్డికి కుమారుడు మృతి చెందిన విషయం తెలియడంతో ఇంటికి తాళం వేసి భార్యను తీసుకోని బయటకు వెళ్ళిపోయాడు. దీంతో మృతదేహాన్ని ఇంటిముందే కాసేపు ఉంచి.. అనంతరం జీపు డ్రైవర్ల సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు మృతి చెందినా తండ్రి అతడిని చూసేందుకు రాకపోవడంతో గ్రామస్తులు బసిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.