ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు : జగన్, చంద్రబాబుని నిలదీయండి

  • Published By: veegamteam ,Published On : January 16, 2020 / 12:49 PM IST
ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు : జగన్, చంద్రబాబుని నిలదీయండి

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి నన్ను కాదు.. చంద్రబాబు, జగన్ ని అడగండి అని అన్నారు. వైసీపీకి చెందిన 22మంది ఎంపీలను నిలదీయండి అని అన్నారు. ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అన్న జగన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. అదే సమయంలో టీడీపీపైనా పవన్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కావాలని అనుకున్న టీడీపీ.. ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకుందని నిలదీశారు. చంద్రబాబు.. ప్యాకేజీకి ఒప్పుకోకుండా ఉంటే బాగుండేదన్నారు. స్పెషల్ స్టేటస్ పై స్పష్టత ఇవ్వమని గతంలోనే తాను కోరానన్నారు.

లెఫ్ట్ పార్టీలకు మీరు బాకీ పడ్డారు అని మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ స్పందించారు. వామపక్షాలకు నేను బాకీ ఉండటం ఏంటని ఎదురు ప్రశ్నించారు. లెఫ్ట్ పార్టీలకంటే ముందు బీజేపీకే మద్దతిచ్చానని పవన్ గుర్తు చేశారు. కొన్ని ప్రత్యేక అంశాలపై బీజేపీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది తప్ప.. దూరం కాలేదన్నారు.

ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. విజయవాడలో నిర్వహించిన సంయుక్త భేటీలో పొత్తుపై బీజేపీ-జనసేన నేతలు అధికారిక ప్రకటన చేశారు. గురువారం(జనవరి 16,2020) విజయవాడలోని ఓ హోటల్ లో బీజేపీ-జనసేన కీలక నేతల మధ్య సుదీర్ఘ సమావేశం(మూడున్నర గంటలు) జరిగింది. ఈ సమావేశంలో పొత్తులు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు. 2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

పవన్ కళ్యాణ్ వారం రోజులుగా బీజేపీతో పొత్తు వైపుగా అడుగులు వేశారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన జనసేనాని బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను కూడా కలిసినట్లు ప్రచారం జరిగింది. పవన్ తిరిగి రాష్ట్రానికి వచ్చిన రెండు రోజులకే.. పొత్తుపై క్లారిటీ ఇచ్చారు.

ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని పవన్ అన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి లాభమన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తామన్నారు. జనసేన, బీజేపీ భావజాలం ఒకటిగానే ఉందని.. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైసీపీ, టీడీపీ వైఫల్యాలను ఎండగడతామని.. ప్రజా సమస్యలపై కలిసి పోరాడతామని పవన్ చెప్పారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి పోటీ చేస్తాయన్నారు. 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీతో కాస్త కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని పవన్ చెప్పారు.

మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రం, దేశం కోసం కలిసి పనిచేయడానికి పెద్ద మనసుతో పవన్ ముందుకొచ్చారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రజా సమస్యలపై, అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతామన్నారు. జనసేన, బీజేపీలు కలవడం చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నామన్నారు.

చంద్రబాబు, జగన్ ల హయాంలో రాష్ట్రం పాతాళానికి వెళ్లిందన్నారు కన్నా. రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా.. అధికారంలోకి రాగానే కుటుంబం, కులం ప్రాతిపదికన అవినీతి, అరాచకం అనే అంశాలే ప్రధానంగా ముందుకు సాగాయన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడతామని.. 2024నాటికి అధికార లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

పవన్ కామెంట్స్:
* ప్రత్యేక హోదా గురించి నన్ను కాదు.. వైసీపీ, టీడీపీని ప్రశ్నించండి
* ప్రత్యేక హోదాపై 22మంది ఉన్న వైసీపీ ఎంపీలను నిలదీయండి
* ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వమని గతంలో కోరాను అంతే
* ప్రత్యేక హోదా కావాలని అనుకుంటే ప్యాకేజీకి టీడీపీ ఎందుకు ఒప్పుకుంది
* ఆనాడు ప్యాకేజీకి టీడీపీ అంగీకారం తెలపకపోతే బాగుండేది
* ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అన్న వైసీపీ ఇప్పుడేం చేస్తుంది

* వామపక్షాలను నేనేమీ బాకీ లేను
* లెఫ్ట్ పార్టీలకంటే ముందు బీజేపీకే మద్దతిచ్చాను
* ప్రతి ఎన్నికలోనూ పరస్పర సహకారంతో వెళ్లాలని నిర్ణయం
* కొన్ని ప్రత్యేక అంశాలపై బీజేపీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది
* టీడీపీ, వైసీపీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం
* మోడీ, అమిత్ షా నమ్మకాన్ని నిలబడెతాం
* ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చడం కరెక్ట్ కాదు

Also Read : 2024లో అధికారం మాదే : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిశా