Pawan Kalyan: అన్నీ గుర్తుపెట్టుకుంటా.. ప్రతి ఒక్కరికీ బదులిస్తా.. ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తా..!

తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.. జనసేనాని పవన్ కల్యాణ్. వైసీపీ నేతల విమర్శలు, పోసాని కృష్ణమురళి వంటివారి కామెంట్లకు.. బదులిచ్చారు.

Pawan Kalyan: అన్నీ గుర్తుపెట్టుకుంటా.. ప్రతి ఒక్కరికీ బదులిస్తా.. ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తా..!

Pawan

తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు.. జనసేనాని పవన్ కల్యాణ్. వైసీపీ నేతల విమర్శలు, పోసాని కృష్ణమురళి వంటివారి కామెంట్లకు.. బదులిచ్చారు. కచ్చితంగా అందరినీ గుర్తు పెట్టుకుంటానని… ఎవర్నీ వదలే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే తాట తీస్తానంటూ హెచ్చరించారు. తాను పౌరుషం, ఆత్మాభిమానం ఉన్నవాడినని.. మాట పడేవాడిని కానని.. అన్నారు. కానీ.. ప్రజల కోసం.. తాను ఇన్ని తిట్లు పడుతున్నట్టు చెప్పారు.. పవన్. ఆడవాళ్లను తిట్టడం సరికాదని.. తాను అలా మాట్లాడబోనని.. పవన్ చెప్పారు. ఇలా తిట్టే వాళ్లు.. వారి ఇంట్లో కూడా ఆడబిడ్డలు, అమ్మలు ఉన్నారని తెలియదా.. వారు ఇలాంటి విమర్శలు తప్పు అని చెప్పలేదా.. అంటూ ప్రశ్నించారు. తనకు.. తన తండ్రి వేల కోట్ల ఆస్తులు ఇవ్వలేదని.. ఎస్టేట్లు ఇవ్వలేదని.. తెగింపు, ధైర్యం మాత్రమే తన తండ్రి ఇచ్చారని అన్నారు పవన్.

ప్రశ్నిస్తూనే ఉంటా…
ప్రజలు అధికారం ఇచ్చినా.. ఇవ్వకున్నా సేవ చేస్తూనే ఉంటానని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. కులాల ఐక్యత అన్నది.. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతోనే చెప్పాను తప్ప.. మరేదీ కాదన్నారు. దాష్టీకాలు, దౌర్జన్యాలు మాత్రమే తన ప్రత్యర్థులని.. వాటిపై పోరాడి తీరతానని పవన్ చెప్పారు. ప్రజలు తనను ముఖ్యమంత్రిని చేసినా.. చేయకున్నా.. ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు.

అలా అయితే.. వేల కోట్లు సంపాదించేవాడిని…
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఎకరం భూమి లక్ష రూపాయలు ఉన్నప్పుడు.. తన ఆదాయం కోటి రూపాయలని చెప్పిన పవన్.. తలుచుకుంటే వేల ఎకరాలు కొనేవాడినని.. ఇప్పుడు నిజాయితీగా వేల కోట్ల రూపాయలకు అధిపతిని అయి ఉండేవాడినని చెప్పారు. కానీ.. తన లక్ష్యం ధనార్జన కాదని.. ప్రజల కోసం పని చేయడమే అన్నారు. వైసీపీ నాయకుల్లాగా డబ్బులు సంపాదించడం తన లక్ష్యం కానే కాదని చెప్పారు.

సినిమాలు కాదు.. ప్రజాసేవే ఇష్టం
తన మొదటి సినిమాకు.. నెల రోజులకు 5 వేల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు పవన్ చెప్పారు. జానీ సినిమా ఫెయిల్ అయినప్పుడు రూపాయి కూడా మిగల్చుకోకుండా అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేశానని గుర్తు చేసుకున్నారు. తాను ఇష్టపడి సినిమాల్లోకి రాలేదని.. ప్రజా సేవ అంటేనే తనకు ఇష్టమని పవన్ చెప్పుకొచ్చారు. అలాంటి తనపై.. అనవసరంగా విమర్శలు చేస్తే.. ఊరుకునేదే లేదని.. భయపడే రోజులు పోయాయని అన్న పవన్.. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని మరీ బదులిస్తానని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెడితే.. బయటకు లాక్కొచ్చి మరీ కొడతామని వ్యాఖ్యానించారు.

ఎలా కావాలంటే.. అలా యుద్ధం చేస్తా…

తాను ఎవరికీ భయపడేవాడిని కానని పదే పదే చెప్పిన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. తాను ప్రజల తరఫున యుద్ధం చేస్తానని తేల్చి చెప్పారు. ఎలా కావాలంటే అలా యుద్ధం చేసేందుకు తాను సిద్ధమని.. ఈ విషయంలో వైసీపీ నాయకులే నిర్ణయించుకోవాలని అన్నారు.