బీజేపీతో పొత్తుకోసం ఎందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడారు?

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 06:07 AM IST
బీజేపీతో పొత్తుకోసం ఎందుకు పవన్ కళ్యాణ్ తహతహలాడారు?

ఢిల్లీ పర్యటన అనంతరం కాకినాడలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్‌… ఒక్కసారిగా స్వరం మార్చారు. కేంద్రంతీరుపై సానుకూలంగా స్పందించారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, మహిళలపై దాడులను కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతోనైతే ప్రధాని ముందుకెళ్తున్నారో… ఆ ఆశయాలు ఏపీలో కనిపించట్లేదన్నారు పవన్‌. 
రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏపీలో జరిగే అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగానే చేయాలనే అవగాహనకు వచ్చింది.

పవన్ ఢిల్లీ టూర్ 
ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశంలో ఇదే అంశాన్ని చర్చించారని అంటున్నారు. రెండు పార్టీల బలాలు, బలహీనతలపై చర్చించుకున్న తర్వాత ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారట. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సీరియస్‌గానే చర్చించుకున్నారు. అమరావతి అంశం ప్రధానంగా ఇద్దరి మధ్యా చర్చకు వచ్చినట్లు సమాచారం. 

2014లో బీజేపీ, టీడీపీలకు జనసేన అండ
జనసేన అధినేత పవన్ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు అండగా నిలిచారు. వారి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. అప్పట్లో ఆ రెండు పార్టీలు లబ్ధి పొందాయి. అటు బీజేపీ అగ్రనేతలతో, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ పవన్‌కు మంచి సంబంధాలున్నాయి. 2014 ఎన్నికల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో రైతుల నుంచి భూముల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటున్న చంద్రబాబు విధానాన్ని పవన్ తప్పుబట్టారు.

2019లో ఒంటరిగా పోటీ
రైతులకు అండగా నిలవడానికి ఆ సమయంలో రాజధాని ప్రాంతంలో రైతులతో సమావేశం కూడా నిర్వహించారు. తరుచూ రెండు పార్టీల మీద విమర్శలు చేస్తూ…. వారికి పూర్తిగా దూరమయ్యారు పవన్‌. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఒకే ఒక్క ఎమ్మేల్యే స్థానాన్ని దక్కించుకుంది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా ఇపుడు జనసేనకు దూరంగా ఉంటున్నారు.

ఒంటరి సాధ్యం కాదనే
వైసీపీలో చేరడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అటు తెలుగుదేశం పైనా, ఇటు జనసేన పైనా వైసీపీ విమర్శల దాడులు పెంచింది. మరో వైపు రాజధాని అంశం ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో ఒంటరి పోరాటం సాధ్యం కాదని పవన్ భావిస్తున్నారట. బీజేపీ అండ ఉంటేనే పరిస్థితులు చక్కబడతాయిని అనుకుంటున్నారట. అందుకే బీజేపీ నేతల్ని నేరుగా కలిసి మంతనాలు జరిపారు. ఇరువురి భేటీపై 2020, జనవరి 16వ తేదీ గురువారం ఓ కీలక నిర్ణయానికి రానున్నారు. 

Read More : ఏపీ పొలిటిక్స్‌లో ఉత్కంఠ : బీజేపీతో దోస్తీకి జనసేన సిద్ధం!