Pawan Kalyan : నిరుద్యోగుల కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. జాబ్ కేలండర్ పై జనసేన పోరాటం

నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని పవన్ నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు.

Pawan Kalyan : నిరుద్యోగుల కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. జాబ్ కేలండర్ పై జనసేన పోరాటం

Pawan Kalyan

Pawan Kalya : కొంత కాలంగా సినిమా షూటింగ్ లకే పరిమితమైన జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. ఇటీవల మంగళగిరిలో పర్యటనించిన పవన్.. రాజధాని రైతులు, నిరుద్యోగులను కలిశారు. వారి సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా నిరుద్యోగుల కోసం నేరుగా రంగంలోకి దిగి పోరాడాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని పవన్‌ చెప్పారు.

ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్ మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని పవన్ చెప్పారు. ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్‌ అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్‌ క్యాలెండర్‌లో 10వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం కచ్చితంగా యువతను వంచించడమే అవుతుందన్నారు.

ఏ విధంగా మోసపోయామో నిరుద్యోగ యువతీయువకులు ఎంతో ఆవేదన చెందుతూ వారి పరిస్థితిని తనకు వివరించారన్నారు. గ్రూప్‌-1, 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమేనని అర్థమవుతుందన్నారు. కొద్ది నెలల కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్‌-1, 2ల్లో సుమారు 1000 ఖాళీలను గుర్తించారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌లో 36 మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.

ఉద్యోగాలకు సుమారు 20 లక్షల మంది వరకూ పోటీ పడతారని, పోటీ పరీక్ష ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఈ విధంగా నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకొంటుందని పవన్‌ వాపోయారు. టీచర్ పోస్టులు వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయని, సీఎం చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయిందని నిలదీశారు. పోలీసు శాఖలో 7 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదని పవన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభించని పరిస్థితి నెలకొందని పవన్ వాపోయారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణ కూడా సాగటం లేదని పవన్‌ అన్నారు.