బీజేపీతో కలిసి రానంటూ పవన్‌ మారాం!

  • Published By: sreehari ,Published On : February 3, 2020 / 01:02 PM IST
బీజేపీతో కలిసి రానంటూ పవన్‌ మారాం!

బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం అనుమానాస్పదంగా తయారైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హడావుడి ఢిల్లీ పర్యటన.. అక్కడ నుంచి వచ్చాక బీజేపీ రాష్ట్ర నేతలతో కలసి ప్రెస్‌మీట్‌.. ప్రభుత్వంపై పోరాటం అంటూ చెప్పిన మాటలు.

ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయిన పవన్‌ కల్యాణ్‌.. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బీజేపీతో కలిసి ముందుకు సాగడం పవన్‌కు ఇష్టం లేదా అనే ప్రశ్నలకు తావిస్తోందని అంటున్నారు. ప్రెస్‌ మీట్‌ తర్వాత రెండు పార్టీలు కలసి అమరావతి లాంగ్‌ మార్చ్‌ చేపట్టబోతున్నామని ప్రకటన కూడా చేశారు. కానీ, అది కూడా వాయిదా పడిపోయింది. దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయంటున్నారు జనాలు.

అంత ఈజీ కాదంటున్న నేతలు :
రెండు పార్టీలు జనాల్లోకి కలసి వెళ్లడం అంత ఈజీ కాదేమో అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని జనసేన, బీజేపీ నేతలే అంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. అది కేవలం ప్రెస్ మీట్లకే పరిమితంలా కనిపిస్తోందంట. మీడియాతో మాట్లాడేటప్పుడు మాత్రమే బీజేపీ నేతలో కలసి కూర్చొనేందుకు పవన్‌ ఇష్టపడుతున్నారనే టాక్‌ నడుస్తోంది. జనంలోకి వెళ్లేటప్పుడు మాత్రం బీజేపీ నేతలు తన పక్కన ఉండకూడదని పవన్‌ అంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే ఈ రెండు పార్టీలు కలసి చేద్దామనుకున్న లాంగ్ మార్చ్ వాయిదా పడిందనేది టాక్‌. పవన్, బీజేపీ నేతల మధ్య మాట కలవకే అది వాయిదా పడిందని చెబుతున్నారు.

ఒకేసారి భగ్గుమన్న పవన్ :
నిజానికి పవన్ మరోసారి రాజధాని రైతుల వద్దకు వెళ్లాలనుకున్నారు. అయితే, ఈసారి తామూ వస్తామని బీజేపీ నేతలు కబురు పంపారట. ఇది పవన్‌ కల్యాణ్‌కు అసలు రుచించలేదంట. ఒక్కసారి భగ్గుమన్నారని టాక్‌. తానైతే రాలేనని, కావాలంటే మీతో పాటు జనసేనకు చెందిన కింది స్థాయి నాయకులను తీసుకెళ్లమని ఓ సలహా ఇచ్చారట పవన్‌.

చేసేదేం లేక పవన్‌ మాట ప్రకారమే.. బీజేపీ-జనసేన నేతలు కలసి రాజధాని ప్రాంత రైతుల్ని పరామర్శించి వచ్చారు. వారితో కలసి నిరసన దీక్షల్లో కూర్చుని నినాదాలతో పాటు ప్రసంగాలు చేశారు. ఇదంతా చూసిన జనాలు పవన్‌ లేకుండా ప్రొగ్రామ్‌ ఏంటి అనుకుని ముక్కున వేలేసుకున్నారు. కాకపోతే పవన్ కల్యాణ్‌ మాత్రం సింగిల్‌గా మరో పర్యటనకు ఫిక్సయ్యారని చెబుతున్నారు.

రాజధాని ప్రాంత రైతులు వచ్చి తనను కలిశారని, ఉద్యమానికి మద్దతుగా మరోసారి గ్రామాల్లోకి రమ్మని కోరారని పవన్‌ పేరుతో ఒక ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేసింది ఆ పార్టీ యంత్రాంగం. అందుకే త్వరలో టూర్ ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతానికి సినిమా పనుల్లో బిజీ అయిన తర్వాత ఈ మధ్య జనంతో జనసేనానికి కాస్త గ్యాప్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా దూరమైతే జనాలు రకరకాలుగా అనుకుంటారనే ఉద్దేశంతోనే ఇప్పుడు మరోసారి జనం మధ్యలోకి వెళ్లాలని డిసైడ్‌ అయ్యారని జనసైనికులు అనుకుంటున్నారు. కాకపోతే బీజేపీ నేతలు పక్కన లేకుండా ప్లాన్‌ చేసుకున్నారు.

ఇన్ని కండిషన్స్ పెడితే ఎట్టా? :
పొత్తు పెట్టుకున్న పార్టీ నేతలు పక్కన లేకుండా కలసి పోరాటం చేస్తామని చెప్పడంలోని ఆంతర్యమేంటో పవన్‌ కల్యాణే చెప్పాలని బీజేపీకి చెందిన కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారట. ఇప్పుడే ఇన్ని కండిషన్స్‌ పెడితే.. భవిష్యత్‌లో ఎలా కలసి ప్రయాణం చేస్తారోనని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. పవన్‌కి మాత్రం బీజేపీ నేతలపై ఇంకా గురి కుదిరినట్టుగా లేదని కొందరు అంటుంటే… బీజేపీతో వెళ్లడం వల్ల జనాల్లో ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో తెలియకుండా కలిసి వెళ్తే ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అంటున్నారు.

పవన్‌ వైఖరి ఇలానే కొనసాగితే.. వచ్చే ఎన్నికల వరకూ కలిసే పోరాడతామని చెప్పినప్పటికీ ఆ లోపే బంధం పుటుక్కుమని తెగిపోయేలా ఉందని రెండు పార్టీల్లోని కార్యకర్తలు లోలోపల అనుకుంటున్నారు. నిజానికి పవన్‌ వ్యవహార శైలితో బీజేపీ కొంత ఇరకాటంలో పడింది. పవన్‌ను పక్కన పెట్టుకొని ఏపీలో పుంజుకోవాలని, పొలిటికల్‌ మైలేజ్‌ పెంచుకోవాలని బీజేపీ పెద్ద ప్లాన్స్‌ వేసుకుందట.

తమకు పట్టు పెరిగిన తర్వాత మెల్లగా పవన్‌ను పక్కనపెట్టాలనేది ఆ పార్టీ ఆలోచన అని అంటున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన విధానం ఇదే. కానీ పవన్ కల్యాణ్‌ మాత్రం.. బీజేపీకి అలాంటి చాన్స్ ఇవ్వడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని జనాలు అనుకుంటున్నారు.