జనసేనకు చిరంజీవి సపోర్ట్‌పై పవన్‌ కీలక వ్యాఖ్యలు

జనసేనకు చిరంజీవి సపోర్ట్‌పై పవన్‌ కీలక వ్యాఖ్యలు

Pawan kalyan’s key comments : చిరంజీవి జనసేనలో చేరతారా లేదా..సరిగ్గా ఇదే అంశంపై పవన్‌ కళ్యాణ్ పెదవి విప్పారు. అయితే తన అన్నయ్య జనసేనలో చేరికపై ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు . కాపులు యాచించేస్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన ఆయన..ఇప్పటికైనా కాపులు ఏకమై రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే ఇటీవల ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని ఓ టాక్‌ బలంగా వినిపించింది. నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యలతో ఆ వాదనకు బలం చేకూరింది. అయితే దీనిపై ఎట్టకేలకు పవన్‌కళ్యాణ్ స్పందించారు. చిరంజీవి నైతిక మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. తమ్ముడిగా తన విజయాన్ని చిరంజీవి కోరుకుంటారని అన్నారు. అయితే అన్నయ్య …తాను స్థాపించిన జనసేన పార్టీలోకి వస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేనని ఈ ఎపిసోడ్‌కు కామా పెట్టారు.

అమరావతిలో కాపు ప్రతినిధులతో సమావేశమైన పవన్‌ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసించేస్థాయిలో ఉండాల్సిన కాపులు..యాచించే స్థాయిలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, సామాజికంగా కాపు, బీసీ కులాల్లో అసమానతలున్నాయన్నారు పవన్‌కల్యాణ్‌. బ్రిటీష్‌ కాలం నుంచి కాపు సామాజికవర్గాన్ని తరతరాలుగా విభజించి పాలిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా కాపులు ఏకమై పోరాటం చేసి రాజ్యాధికారం సాధిస్తేనే…కాపులతో పాటు బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీ జనాభాలో 27 శాతం ఉన్న కాపుల్ని ఓటు బ్యాంకుగా చూడడాన్ని ప్రతి రాజకీయ పార్టీ విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తుని ఘటనలో కాపులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన పవన్‌ కళ్యాణ్.. తనకు కులాన్ని ఆపాదించవద్దన్నారు. తాను ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదన్న పవన్‌ కళ్యాణ్….కాపుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.