లెక్క తేలేనా…… పొత్తు కుదిరేనా ?

  • Published By: chvmurthy ,Published On : March 8, 2019 / 03:13 PM IST
లెక్క తేలేనా…… పొత్తు కుదిరేనా ?

అమరావతి: జనసేన వామపక్షల మధ్య సీట్ల లెక్క తేలడం లేదు. ఇప్పటివరకూ అనేకసార్లు సమావేశాలు జరిగినా సీట్ల పంపకాల విషయం కొలిక్కిరాలేదు. సీట్లు ఫైనల్ చేయాలంటూ లెఫ్ట్ పార్టీలు జనసేనపై ఒత్తిడి తెస్తున్నాయి.  రాష్ట్ర విభజన తరువాత ఉనికి కోల్పోయిన వామపక్ష పార్టీలు రాష్ట్రంలో ప్రత్యామ్న్యాయ రాజకీయ వ్యవస్థ కోసమంటూ జనసేనతో చేతులు కలిపాయి. జనసేనతో పొత్తు ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోసం ఆరాట పడుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే అనేక సార్లు చర్చించిన ఇరు వర్గాలు ఆ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీకి రాలేదు. 

ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాత్రం మూడు పార్టీల పొత్తుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించలేదు. దీంతో జనసేన అధినేత నిర్ణయం కోసం వామపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం ఎదురు చూడాల్సిన పరిస్థితి  ఏర్పడింది. మరోవైపు జనసేనతో పొత్తు అని ముందుగానే ప్రకటించుకున్న వామపక్షాలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.  అయితే అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు జరగకపోవడం దీనిపై పవన్‌ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు  వామపక్షాలు  డైలమాలో  పడ్డాయి. జనసేన అధినేతను నమ్ముకుని రాష్ట్రంలో ప్రచారం ప్రారంభించిన వామపక్షాలకు ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కావడంలేదు. ఇదే  విషయంపై ఇరుపార్టీల సమావేశాల్లోనూ చర్చించినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు అభ్యర్ధులను ఫైనల్ చెయ్యకపోవడంతో వామపక్ష  పార్టీ నేతలే అగ్రనాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో ఉన్న 13జిల్లాల్లో  జిల్లాకు రెండు నియోజకవర్గాల చొప్పున సీట్లు కేటాయించాలని వామపక్షాల నేతలు, జనసేన అధినేత దృష్టికి  తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన జనసేనాని తన నిర్ణయం మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఇప్పటికే  సీపీఎం, సీపీఐ నేతలు విజయవాడతో పాటు కర్నూలు విశాఖ ఏజెన్సీ, పోలవరం ముంపు మండలంలో తమ ప్రచార కార్యక్రమాలను  ప్రారంభించారు. అయినా పవన్ మాత్రం నోరు మెదపకుండా వారిలో మరింత వత్తిడి తెస్తున్నారు.
మరోవైపు సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ తన నిర్ణయం వెల్లడించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని జనసేన నేతలు  చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించిన తరువాత  పూర్తి స్థాయిలో సభ్యుల ఎంపికతో పాటు సీట్ల సర్దుబాటు ఉంటుందంటున్నారు.  మొత్తానికి వామపక్షాలు, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.